మంత్రి కేటీఆర్‌తో మహారాష్ట్ర మాజీ మంత్రి అదిత్య ఠాక్రే భేటీ

ముద్ర తెలంగాణ బ్యూరో:మహారాష్ట్ర మాజీ మంత్రి అదిత్య ఠాక్రే తో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీ రామారావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో టీహబ్ కు వెళ్లిన ఆయన దేశాభివృద్ధిపై పలు అంశాలను కేటీఆర్‌తో పంచుకున్నారు. అలాగే టీహబ్ ప్రత్యేకతను, దాని వివరాలను అదిత్య ఠాక్రేకు కేటీఆర్ వివరించారు. టీ హబ్ పనితీరు, ప్రోత్సహకాల విషయాలను కూడా ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. అక్కడే కేంద్ర ప్రభుత్వం పనితీరు, జాతీయ రాజకీయలపై చర్చించినట్లు సమాచారం.

ఈనేపథ్యంలో అధిత్య ఠాక్రే.. తాను మంత్రి కేటీఆర్‌ను కలిశానంటు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కేటీఆర్‌ను కలవడం సంతోషం, ప్రోత్సహకంగా ఉందని తెలిపారు. స్థిరత్వం, నగరీకరణ, సాంకేతికత విషయాలపై మాట్లాడుకున్నామని.. ఫలితంగా అవి దేశాభివృద్ధి్కి ఎలా దోహదం చేస్తాయనే అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. టీహబ్‌లో స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు, ఆలోచనపరుల కోసం అక్కడ జరుగుతున్న అద్భుతమైన పనులను చూశానంటూ రాసుకొచ్చారు.