మహారాష్ట్రలో కెసిఆర్ ప్రభావం శూన్యం

మహారాష్ట్రలో కెసిఆర్ ప్రభావం శూన్యం

శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ

ముద్ర, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రభావం శూన్యం అని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య పదాధికారుల సమావేశం జరిగింది. దీనిలో పాల్గొన్న సింకారు శివాజీ మాట్లాడారు.. తెలంగాణలోని సమస్యలను గాలికొదిలేసిన సిఎం కేసీఆర్ మహారాష్ట్రంలో ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆరు వందల కార్లు కాదు కదా ఆరువేల కార్లలో వెళ్ళినా కేసీఆర్ ఆయన అనుచరులను మహారాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. మహారాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోటీ చేసిన కేసీఆర్ మోసాలను గల్లీ గల్లీ తిరగి ప్రచారం చేస్తామని హెచ్చరించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో శివసేన పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతులు, కార్మికులు, విద్యార్ధులు, ఉద్యోగార్థులు సహా ఏ వర్గం వారు ఆనందం లేరని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సర ప్రారంభ క్రమంలో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో ఫీజులు దోపిడి జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా శివసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటిగోపి కిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా యువసేన అధ్యక్షుడు వినోద్ నాయక్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.