నిజాం షుగర్​ ఫ్యాక్టరీని తెరిపించాలి | Mudra News

నిజాం షుగర్​ ఫ్యాక్టరీని తెరిపించాలి | Mudra News

ముద్ర ప్రతినిధి, హైదరాబాద్​: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా  ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేస్తూ సీఎం కేసీఆర్​ వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యాహ్న సమయంలో రైతు ఐక్యవేదిక నాయకులు నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా  నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతు నాయకులకు , పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది.  అనంతరం తెలంగాణ రైతు ఐక్యవేదిక నాయకులను అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .   తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి , చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డిలు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. తమను పోలీసులు అక్రమంగా అడ్డుకొని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకుండా ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించారని  ధ్వజమెత్తారు.  నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు , నిరాహార దీక్షలు ,  రాస్తారోకోలు , పాదయాత్ర , అసెంబ్లీ ముట్టడి వంటి అనేక పోరాటాలు చేపట్టినా సీఎం కేసీఆర్ ఏమాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు . చెరుకు రైతులు ప్రస్తుతం పంటను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారన్నారు. దీంతో రవాణా ఖర్చు తడిసి మోపిడై రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుందన్నారు. చెరుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తక్షణమే మూసివేసిన నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు గురిజాల రాజారెడ్డి , రైతు ఐక్యవేదిక నాయకులు న్యావనంది లింభారెడ్డి తదితరులు పాల్గొన్నారు.