జనగామలో ‘డబుల్’ లొల్లి | Mudra News
![జనగామలో ‘డబుల్’ లొల్లి | Mudra News](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63e9c7c30db01.jpg)
- సీపీఎం ఆధ్వర్యంలో ఇండ్ల ముట్టడి
- ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఇండ్ల వద్దకు చేరుకున్న లీడర్లు
- పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తం
ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామలో ‘డబుల్’ లొల్లి మొదలైంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని బాణాపురం ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కమిటీలను వేసింది. ఈ నెల 13, 14న పట్టణంలోని వార్డుల వారీ సమావేశాలు నిర్వహించి ఎంపిక చేపట్టేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం మీడియాకు నోట్ రిలీజ్ చేశారు. ఆన్లైన్, ఆఫ్ లైన్లో వచ్చిన దరఖాస్తులను కమిటీలు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ పర్యవేక్షణలో ఈ మీటింగ్లు జరుగనున్నాయి. డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం, ఆఫీసర్లు అనుసరిస్తున్న తీరు సరిగా లేదని సీపీఎం లీడర్లు ఆరోపిస్తున్నారు. గతంలో మూడో విడత ఇందిరమ్మ ఇళ్లలో పట్టాలు వచ్చి ఉన్న పేదలకు ఇండ్లు ఇచ్చిన తర్వాతే వేరే వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో యేళ్లుగా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలతో కలిసి సీపీఎం లీడర్లు ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఇండ్ల ముట్టడి చేపట్టారు. దాదాపు 600 మంది జనం అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని ఇది పద్ధతి కాదని సముదాయించినా ఫలితం లేదు.