ఏప్రిల్​ 25 నుంచి సమ్మర్​ హాలీడేస్-​ ప్రకటించిన విద్యాశాఖ

ఏప్రిల్​ 25 నుంచి సమ్మర్​ హాలీడేస్-​ ప్రకటించిన విద్యాశాఖ
  • పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల
  • పది పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి
  • ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి

ముద్ర, తెలంగాణ బ్యూరో : పాఠశాల విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలతో పాటు వేసవి సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ఆదివారం వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ–-2 పరీక్షల తేదీలలో పలు మార్పులు చేసింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ–-2 పరీక్షలు ప్రారంభం కావాలి. ఇందులో మార్పులు చేశారు. ఏప్రిల్ 12 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి13 వరకు నిర్వహించనున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు వార్షిక పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఒంటిపూట బడులు
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి విద్యార్థులకు ఒంటి పూట తరగతులు ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్ధులకు నాలుగు సబ్జెక్టులే ఉన్నందున ఏప్రిల్ 17తో పరీక్షలు పూర్తి కానున్నాయి. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఫలితాలను ఏప్రిల్ 21న వెల్లడిస్తారు. ఏప్రిల్ 24న స్కూల్స్ లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి పలు అంశాలపై చర్చిస్తారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. 48 రోజుల పాటు సమ్మర్ హాలీ డేస్ రానున్నాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.

ఇంటర్ పరీక్షలు
ఈ నెల 15నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి రెండుతో  ముగుస్తాయి. వీటిని ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు బ్యాచ్‌లవారీగా వారిగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. కాలేజీ ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయకుండా హాల్ టిక్కెట్లు జారీ చేయాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్ని జూనియర్ కాలేజీలను ఆదేశించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తర్వాత మార్చి 4న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షలను, మార్చి 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. విద్యార్థులు తమ ఐడీ ద్వారా వెబ్‌సైట్‌ లో లాగిన్‌ అయి హాల్‌ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఎంసెట్​ కు 45 మార్క్స్​ మస్ట్​
ఎంసెట్‌కు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్‌ రాసే అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులు ఇంటర్‌ గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, రిజర్వేషన్‌ క్యాటగిరీ వారు 40 శాతం మార్కులు తప్పనిసరి. కరోనా ప్రభావం వల్ల 2021, 2022 సంవత్సరాల్లో ఈ నిబంధన నుంచి విద్యార్థులకు మినహాయింపు ఇచ్చారు. కరోనా లేకపోవడం, విద్యా సంవత్సరం సజావుగా సాగుతుండటం, 100 శాతం సిలబస్‌తో అన్ని పరీక్షలు జరుగుతుండటంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వబోమని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి వెల్లడించారు.