రేవంత్​వ్యాఖ్యలపై కాంగ్రెస్​సెల్ఫ్​గోల్!

రేవంత్​వ్యాఖ్యలపై కాంగ్రెస్​సెల్ఫ్​గోల్!
  • ఉచిత విద్యుత్​పై అమెరికాలో నోరు జారిన టీపీసీసీ చీఫ్
  • తెలంగాణలో దుమారం లేపిన కరెంట్​ఇష్యూ!
  • కాంగ్రెస్​ను రైతు వ్యతిరేకిగా అభివర్ణించిన బీఆర్ఎస్​
  • కప్పిపుచ్చుకునే పనిలో కాంగ్రెస్
  • రేవంత్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి
  • నేడు బీఆర్ఎస్, కాంగ్రెస్​పోటాపోటీ నిరసనలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఉచిత విద్యుత్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికాలోని తానా ముగింపు సభలో జూలై 10న పాల్గొన్న రేవంత్​రెడ్డి.. తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. రేవంత్​వ్యాఖ్యలను ప్రధాన అస్త్రంగా మలుచుకున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్​ను రైతు వ్యతిరేకిగా అభివర్ణించింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ​రైతు అనుకూల కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు బీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువనేత సూచన మేరకు పార్టీ శ్రేణులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రేవంత్​దిష్టిబొమ్మలకు నిప్పంటించారు. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్​అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతుందంటూ బీఆర్ఎస్​మంత్రులు, ఎమ్మెల్యేలంతా సమావేశాలు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. పలుచోట్ల జరిగిన ఆందోళనలో మంత్రులు పాల్గొన్నారు. 

రేవంత్​వ్యాఖ్యలను తప్పుబట్టిన కాంగ్రెస్..

ఉచిత విద్యుత్ పై రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలిసో తెలియకో.. ఒత్తిడో.. లేక వ్యూహమో తెలియదుగానీ రేవంత్​పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ పలువురు సీనియర్లు రేవంత్​వ్యాఖ్యలను తప్పుబట్టారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఏకంగా ఓ అడుగు ముందుకేసి.. రేవంత్​రెడ్డి చెప్పింది ఇక్కడ నడవదని చెప్పారు. తాను రేవంత్​కంటే సీనియర్ నని, పైగా స్టార్​క్యాంపెయినర్ అని, తాను చెబితేనే ఇక్కడ నడుస్తదని కుండబద్దలు కొట్టారు. రేవంత్​చెబితే ఏదీ కాదన్న ఆయన.. కాంగ్రెస్​రేవంత్ సొంత పార్టీ అసలే కాదని ఘాటైన విమర్శలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రోజుకు పది గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్​అంశాన్ని కచ్చితంగా చేర్చుతామన్నారు. 

రేవంత్​ను వెనకేసుకొచ్చిన లీడర్లు..

ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్​కుమార్ గౌడ్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్​చైర్మన్​సుంకేట అన్వేష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తదితర నేతలు రేవంత్​రెడ్డిని వెనకేసుకొచ్చారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వటమే కాంగ్రెస్ విధానమని, అమెరికాలో రేవంత్​వ్యాఖ్యలను వక్రీకరించారని టీపీసీసీ చీఫ్​ను వెనకేసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎన్నికల వేళ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్​రెడ్డి ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటోన్న కాంగ్రెస్​ను ఇలాంటి వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని సీనియర్లు రేవంత్​కు సూచించినట్లు సమాచారం. కాగా రేవంత్​వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయని, కానీ అగ్రనేతలెవరూ స్పందించలేదని విశ్వసనీయంగా తెలిసింది. 

ఆందోళనకు ఆజ్యం..!

ఉచిత విద్యుత్​పై రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్​పార్టీల మధ్య ఆందోళనకు ఆజ్యం పోశాయి. ఉచిత విద్యుత్ ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని, మండిపడ్డ కేటీఆర్​గతంలో విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర ఆ పార్టీదని ధ్వజమెత్తారు. మంగళ, బుధవారాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా బుధవారం ‘సత్యాగ్రహ దీక్ష’ నిర్వహణకు కాంగ్రెస్​ఇచ్చిన పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నుంచి దృష్టిమరల్చేందుకే బీఆర్ఎస్​ఆందోళనలు చేపడుతుందని కాంగ్రెస్​నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో పిలుపుని నీరుగార్చాలని, ఉచిత విద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది. 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను డిమాండ్​చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి కాంగ్రెస్​పిలుపునిచ్చింది. దీంతో బుధవారం బీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసనలకు ఆయా పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.

నేనలా అనలేదు : టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతులకు ఉచిత విద్యుత్ పై తాను చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి వివరణ ఇచ్చారు. అమెరికాలో తాను అనని మాటలను అన్నట్టు బీఆర్ఎస్​దుష్ప్రచారం చేస్తూ.. మోడీని కాపాడే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా బీజేపీ రద్దు చేయడంతో బుధవారం ‘సత్యాగ్రహ దీక్ష’ పేరుతో గాంధీజీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ సమయంలో ఇలాంటి అబద్ధాలు చెప్పి బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తూ, దీక్షను నీరుగార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. వరంగల్ సభలో రాహుల్​గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ తో రైతుల్లో భరోసా కలిగిందని, దీంతో భయపడిన బీఆర్ఎస్.. చిల్లర ప్రచారాలతో లబ్ధిపొందే కుట్రకు తెరలేపిందన్నారు. రైతులకు12 గంటల విద్యుత్ ఇవ్వని బీఆర్ఎస్ సర్కారు.. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు రైతులను మోసం చేస్తోందన్నారు. దీనికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాల్సిందిగా శ్రేణులుకు పిలుపునిచ్చినట్లు రేవంత్​తెలిపారు.