జర్నలిస్టులకు ఆరోగ్య బీమా అమలు చేయండి: టీయూడబ్ల్యూజే కార్యవర్గం డిమాండ్ 

జర్నలిస్టులకు ఆరోగ్య బీమా అమలు చేయండి: టీయూడబ్ల్యూజే కార్యవర్గం డిమాండ్ 

హైదరాబాద్: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీ యూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  ప్రభుత్వ, కార్పోరేట్ ఆస్పత్రులలో హెల్త్ కార్డులపై వైద్య సహాయం అందకపోవడంతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారని   టీయూడబ్ల్యూజే  ఒక తీర్మానంలో పేర్కొంది. యూనియన్ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారంనాడు యూనియన్ అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి కె విరాహత్ అలీ యూనియన్ కార్యకలాపాల నివేదికను సమర్పించారు.  రాష్ట్రంలోని అర్హులైన  జర్నలిస్టులందరికీ  ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీయూడబ్ల్యూజే మరో తీర్మానంలో విజ్ఞప్తి చేసింది.

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఐజేయూతో సహా దేశంలోని పలు మీడియా సంఘాలు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ ఐటీ చట్టంలో మార్పులు చేసి పీఐబీ ద్వారా సెన్సార్ షిప్ కు కేంద్ర ప్రభుత్వం తెరలేపడాన్ని తీవ్రంగా విమర్శించారు. గత నెలలో చండీగఢ్ లో జరిగిన ఐ జేయూ జాతీయ కార్యవర్గ సమావేశం ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా మార్చి 23న 'సేవ్ జర్నలిజం' ఆందోళన విజయవంతంగా జరిగిందని ఆయన చెప్పారు. ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ మరింత గట్టిగా కృషి చేయాలని సూచించారు. సంస్థాగత వ్యవహారాలపై కార్యవర్గ సమావేశం చర్చించింది. మే 15లోగా అన్ని జిల్లాల్లో మహాసభలు పూర్తి చేసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎం. ఏ. మాజిద్,  కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్,  ఉపాధ్యక్షులు కే రామ్ నారాయణ, తాడూరి కరుణాకర్, కార్యదర్శి మధు, కోశాధికారి కె. మహిపాల్ రెడ్డి, యూనియన్ ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు జిల్లా శాఖల అధ్యక్ష,  కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు.