డాక్టర్ల సేవలు అభినందనీయం

డాక్టర్ల సేవలు అభినందనీయం
  • రాష్ట్ర గవర్నర్ తమిళిసై
  • రామానుజ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం

ముద్ర, తెలంగాణ బ్యూరో: వైద్య రంగంలో డాక్టర్లు చేస్తున్న సేవలు అమోఘమైనవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రోగులకు వీరు ప్రత్యక్ష దేవుళ్ళు అని ప్రశంసించారు. అంకిత భావంతో వారు చేస్తున్న సేవల కారణంగానే కరోనా వంటి  విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను  రక్షించగలిగారన్నారు. అందుకే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర  కరోనా బారిన పడిన వారిలో ప్రాణాలు కోల్పోయిన వారి శాతం చాలా  తక్కువ అని అన్నారు.

 శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులను రాజ్‌భవన్‌లో ఆమె ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా  తమిళిసై మాట్లాడుతూ, వైద్యం,  ఆరోగ్య సంరక్షణ రంగంలో డాక్టర్ల సేవలను, సాధించిన విజయాలను కొనియాడారు. ప్రతి సంవత్సరం, వైద్యుల దినోత్సవం రోజున వైద్యరత్న అవార్డుతో నిస్వార్థంగా సేవలను అందించిన  ప్రఖ్యాత వైద్యులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరం డాక్టర్లు ఎ.వై.చారి,  జెవి.రెడ్డి, ఎం.విజయసారథి, ఇ.రాధేశ్యామ్, సిచ.శూలపాణిలను వైద్యరత్న పురస్కారంతో సత్కరించామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రొత్సహిస్తున్న శ్రీ రంగనాథ స్వామి ట్రస్ట్ భవిష్యత్తుల్లో మరిన్ని  విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ కు చెందిన డాక్టర్ ధనుంజయ్,  పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.