కొండగట్టు కళ్యాణకట్టలో ఇష్టారాజ్యం

కొండగట్టు కళ్యాణకట్టలో ఇష్టారాజ్యం

ముద్ర, మల్యాల: ప్రసిద్ది కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట ఇష్టారాజ్యాంగ తయారైంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో కళ్యాణకట్టలో భక్తులు నిలువు దోపిడికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... తిరుమల తిరుపతి మాదిరిగా కొండగట్టు అంజన్న క్షేత్రంలో నిత్యం వేలాది మంది, ఉత్సవాల సమయంలో లక్షల్లో భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. తలనీలాలు సమర్పించే భక్తులు రూ. 50 టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భక్తుల వద్ద నుంచి నాయిని బ్రాహ్మణులు టికెట్ కాకుండా అదనంగా 50 నుంచి 100 వరకు, పుట్టు వెంట్రుకలు సమర్పించే వారి నుంచి 250 నుంచి 500 వరకు వసూల్ చేస్తున్నారు. కొందరైతే టికెట్స్ చింపకుండా, వాటిని రీ సేల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారాన్ని ఇటీవల పలువురు ఆలయ డైరెకర్లు బట్టబయలు చేయడమే కాకుండా ఆలయ అధికారులకు పిర్యాదు చేశారు. కళ్యాణకట్టలో టోకెన్ సిస్టమ్ లేకపోవడం వల్లనే ఇష్టారాజ్యంగా తయారైందని, దాంతో నాయిని బ్రాహ్మణులు ఆలయ ఆవరణలో అడ్డా వేసి, పోటాపోటీగా భక్తులను తీసుకెళ్లి గుండ్లు తీయడంతో కొందరు నష్టపోతున్నారని పలువురు తెలిపారు. టోకెన్ సిస్టమ్ ఉంటే అందరికి సమానంగా పని ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, భక్తుల వద్ద తాము బలవంతంగా డబ్బులు వసూల్ చేయడం లేదని, వారు ఇష్టంగా ఇస్తే తీసుకుంటున్నామని పలువురు నాయిని బ్రాహ్మణులు తెలిపారు. అలాగే టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, కళ్యాణకట్ట విషయమై ఆలయ ఈవో వెంకటేష్ ను వివరణ కోరగా ఆయన సరిగా స్పందించలేదు.