గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో మరో ఇద్దరికి అధిక మార్కులు.. సిట్‌ దర్యాప్తులో వెల్లడి

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో మరో ఇద్దరికి అధిక మార్కులు.. సిట్‌ దర్యాప్తులో వెల్లడి

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ  పేపర్‌ లీకేజీ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.  తాజాగా గ్రూప్‌-1  పరీక్ష రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులపై ఆరా తీసింది. పలువురు ఉద్యోగులకు వచ్చిన మార్కులను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల్లో మరో ఇద్దరికి గ్రూప్‌-1లో భారీగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగం పొందిన షమీమ్‌కు 127 మార్కులు, టీఎస్‌పీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగిగా పని చేస్తున్న రమేశ్‌కు 122 మార్కులు వచ్చినట్లు సిట్‌ బృందం గుర్తించింది.

లీకేజీ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం తీసుకున్నట్లు షమీమ్‌ తెలిపాడు. దీనికోసం డబ్బులేమీ తీసుకోలేదని చెప్పాడు.    మరోవైపు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పూటకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. నిందితుల మొబైల్‌ఫోన్లలోని కాల్‌డేటా, వాట్సప్‌ గ్రూపులు, చాటింగ్‌ ఆధారంగా నిఘా బృందాలు వారి గురించి వాకబు చేస్తున్నాయి. వీరిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. కమిషన్‌లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది ఉద్యోగులు గతేడాది అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైనట్లు తాజాగా గుర్తించారు. వీరిలో కొందరు 100కు పైగా మార్కులు సాధించినట్లు నిర్ధారణకు వచ్చారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్‌ అధికారులు సిద్ధమయ్యారు.