పోలవరంపై జగన్ సమాధానం చెబుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

పోలవరంపై జగన్ సమాధానం చెబుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీలో పోలవరంపై చర్చకు సీఎం జగన్  సమాధానం చెప్పారు. 'టీడీపీ  హయాంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకెళ్లిందా?, పోలవరం అని పలికే అర్హత కూడా చంద్రబాబుకు  లేదు, వైఎస్ కంటే ముందు పోలవరం గురించి ఎవరైనా ఆలోచించారా?' అని జగన్ ప్రశ్నించారు. 2004కు ముందు చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నారు. పోలవరం అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందా? అని జగన్ మండిపడ్డారు. పోలవరం ప్రారంభించింది వైఎస్సార్.. పూర్తి చేసేది ఆయన కొడుకు అని, పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం అని, ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారని జగన్ గుర్తు చేశారు. మరోవైపు.. సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల అసోషియేషన్  జగన్ సర్కార్‌ కు మరో షాక్ ఇచ్చింది. గురువారం ఉదయం సీపీఎస్ ఉద్యోగులు అందరూ తమ శాఖ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. అలాగే ఈ సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు.

ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల సీపీఎస్ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఈ ఏడాది జీతంలో 10 శాతం మినహయించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ వాటాతో కలిపి.. ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు జమచేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 90 శాతం జీతం ఇచ్చి... ఐటీ  మాత్రం మొత్తం జీతానికి ఎలా వసూలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల ప్రతీ ఉద్యోగికి రూ. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పెండింగ్ ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే ఊరుకుంటే పాతబకాయిలు పెరిగిపోతాయని అన్నారు. రాబోయే ప్రభుత్వాలు తమను నిర్లక్ష్యం చేస్తే పరిస్ధితి ఏంటి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.  ఈ అన్యాయంపై ఇప్పటికే అనేక సార్లు విజ్జప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సర్వీసెస్ సెక్రటరీకి పలుమార్లు లేఖలు రాశామన్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం సమాయత్తం కావాలంటూ పిలుపుపిచ్చారు. ప్రతీ డిపార్టుమెంట్‌లో సీపీఎస్ ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు జమ కావాల్సిన డబ్బులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని ఉద్యోగులు డిమాండు చేశారు.