బీఆర్ఎస్​లో  ఓపెన్​ వార్!

బీఆర్ఎస్​లో  ఓపెన్​ వార్!
  • ఎమ్మెల్యే రాజయ్య, కడియం మధ్య ముదురుతున్న విభేదాలు
  • వ్యక్తిగత దూషణలు, బహిరంగ విమర్శలతో రచ్చ
  • పరిణామాలపై హై కమాండ్ సీరియస్
  • రాజయ్యను ప్రగతిభవన్​కు పిలిపించుకున్న కేటీఆర్
  • ఇరువురు నేతలు సఖ్యతగా ఉండాలని ఆదేశాలు
  • గీత దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక
  • త్వరలో ఎమ్మెల్సీ శ్రీహరికి పిలుపు?

ముద్ర, తెలంగాణ బ్యూరో : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య, ఎమ్సెల్సీ కడియం శ్రీహరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇన్నాళ్లు పరోక్షంగా తిట్టుకున్న ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు డైరెక్ట్ గానే ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. రెండు రోజులుగా వీరిమధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో హైకమాండ్ సీరియస్​అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యే తాటికొండకు సీఎంఓ ఆఫీస్​నుంచి ఫోన్ రావడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రగతిభవన్ కు చేరుకున్న రాజయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై రాజయ్యను కేటీఆర్ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజయ్యకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇంకోసారి ఇలా ప్రవర్తించవద్దని కేటీఆర్​స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్‌ దాటి మాట్లాడొద్దని, అధిష్ఠానం మాట ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కేటీఆర్ హెచ్చిరించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఎన్నికలు తరుముకొస్తున్నా..

కొద్దినెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఇలాంటి సందర్భంలో ఇంకా విభేదాల ఊబి నుంచి బయటపడలేకపోతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇద్దరూ కలిసి పనిచేయాలని రాజయ్యతో మంత్రి కేటీఆర్ అన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, వివాదాన్ని ఇంతటితో ముగించాలని అన్నారు. కాగా కడియం శ్రీహరిని కూడా ప్రగతి భవన్ కు పిలిచే అవకాశం ఉందని పార్టీవర్గాలు అంటున్నాయి.

రాజయ్య విమర్శలు.. కడియం ఘాటు స్పందన..

ఇటీవల ప్రధానంగా కడియం శ్రీహరిపై రాజయ్య అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత విమర్శలు చేశారు. కడియం శ్రీహరి కొద్ది రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని ఆరోపించారు. పైగా కడియం కూతురు కావ్య కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనవద్ద ఆధారాలున్నాయని రాజయ్య పేర్కొన్నారు. వారిద్దరూ కాంగ్రెస్ టికెట్లు అడిగారని, త్వరలోనే ఆధారాలు బయటపెడతానని రాజయ్య వ్యాఖ్యానించారు. అలాగే కడియం శ్రీహరి తల్లి కులంపై కూడా రాజయ్య విమర్శలు చేశారు. కడియం మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో కడియం కూడా ఘాటుగా స్పందించారు. రాజయ్య వైద్యుడే అయినా సభ్యత లేదని, తన తల్లి కులం, తన కులం గురించి మాట్లాడడం దారుణమన్నారు. పిల్లలకు తండ్రి కులమే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. తల్లి మాత్రమే సత్యం, తండ్రి అపోహా అని రాజయ్య దారుణంగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలకు ఆయన ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజయ్య నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డారని, దళిత బంధులో కమీషన్లు దండుకున్నారని విమర్శించడంతో అధిష్ఠానం సీరియస్ అయ్యింది.  

కేటీఆర్​పిలుపుతో వచ్చా..

కేటీఆర్​తో సమావేశం అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి, తన మధ్య జరుగుతున్న వివాదంపై మంత్రి కేటీఆర్ పిలుపుతో ప్రగతిభవన్ కు వచ్చానని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 21 రోజులు, 146 గ్రామాలు తిరుగుతూ పనిచేశానని చెప్పారు. అయితే మహారాష్ట్ర వెళ్లి వచ్చాక స్టేషన్ ఘన్ పూర్ లో తనపై అసత్య ప్రచారం జరిగిందని, అందుకే కడియం శ్రీహరిపై  విమర్శలు చేశానని రాజయ్య వెల్లడించారు. నియోజకవర్గంలో కడియం  గ్రూపులు కడుతున్నారని, శ్రీహరితో వివాదం విషయంలో  పార్టీ అధిష్టానం తనకే అనుకూలంగా ఉందని రాజయ్య తెలిపారు. టికెట్ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు క్లారిటీ ఉందన్నారు. సర్పంచ్ నవ్య వివాదం విషయంలోనూ అధిష్ఠానానికి క్లారిటీ ఉందని.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమని తేలిపోయిందన్నారు.