పండుగెట్ల జెయ్యాలె!? చేతిలో పైసా లేదు

పండుగెట్ల జెయ్యాలె!? చేతిలో పైసా లేదు
  • సర్పంచుల నెత్తిన ‘దశాబ్ది’ వేడుకల పిడుగు
  • ఉత్సవాలను బహిష్కరించాలని యోచన?
  • అక్కడక్కడా తీర్మానం చేస్తున్న పంచాయతీలు
  • సర్కారు పెడుతున్న ఖర్చు పెద్ద కార్యక్రమాలకే!
  • గ్రామాలలో వేడుకల బాధ్యత సర్పంచులదే 
  • ఆ భారం మోయలేమంటున్న ప్రథమ పౌరులు
  • ఇప్పటికే అప్పులలో మునిగామని ఆవేదన
  • రాష్ట్ర సర్కారు నిధులు ఇవ్వడం లేదని ఆందోళన
  • అత్యవసర పనులు బిల్లులు కూడా ఇంకా పెండింగులోనే

సర్కారు సంబురాల నిర్వహణకు గ్రామాలలో కష్టాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రావతరణ వేడుకలను దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం రూ. 105 కోట్ల నిధులను కూడా కేటాయించారు. వీటితో మండలాలు, డివిజన్లు, జిల్లా కేంద్రాలలో భారీ ఉత్సవాలకు ఏర్పాట్లు చేసేందుకు కలెక్టర్లకు అనుమతి ఇచ్చారు. కానీ, గ్రామాలలో వేడుకల కోసం రూపాయి ఇవ్వడం లేదు. దీంతో అక్కడ దశాబ్ది వేడుకల నిర్వహణ ఆయోమయంలో పడింది. ఇప్పటికే లక్షలకు లక్షలు అప్పుల్లో కూరుకుపోయి, బిల్లులు రాక అవస్థలు పడుతున్న సర్పంచులు ఈ వేడుకల కోసం మళ్లీ అప్పులు తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పలు చోట్ల దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. 

బహిష్కరించ తప్పదు
మా పంచాయతీ ఖాతాలో చిల్లిగవ్వ లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులతోనే ట్రాక్టర్ల ఈఎంఐలు, కరెంట్​ బిల్లులు, జీతాలు ఇస్తున్నాం. స్టేట్​ గ్రాంట్​ రూపాయి కూడా ఇవ్వడం లేదు. స్టేట్​ ఫైనాన్స్​ గ్రాంట్​పది  నెలల నుంచి ఆపేశారు. మూడేండ్ల కిందట చేసిన పనులకు ఇప్పుడిప్పుడే కొంత కొంత ఇస్తామంటున్నారు. అప్పులు తెచ్చి పనులు చేశాం. వాటికే దిక్కులేదు. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు ఎలా చేయమంటారు? అందుకే బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నాం. స్టేట్ గ్రాంట్​ విడుదల చేస్తే దశాబ్ది ఉత్సవాలు జరుపుతాం  
– బింగి కరుణాకర్, సర్పంచ్, రంగాపూర్, హుజురాబాద్ మండలం.


ముద్ర, తెలంగాణ బ్యూరో:
పంచాయతీలకు ఇటీవల  రూ.1190  కోట్లు విడుదల చేసినా అవన్నీ పాత బిల్లులకు కూడా సరిపోవడం లేదు. ఇంకా స్టేట్ ఫైనాన్స్, 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా కావడం లేదు. ఈ క్రమంలో వేడుకులు ఎలా జరపాలి?  ‘ ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు. పల్లె ప్రగతి, ఇతర సమావేశాల సందర్భంగా పెట్టిన ఖర్చుల బకాయిలు పెండింగ్​లోనే ఉన్నాయి. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలంటే కనీసం ఊరికో రూ. 30 వేలైనా కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పటికే లక్షలకు లక్షల అప్పుల్లో ఉన్నాం. మళ్లీ అప్పులు తెచ్చి పెట్టినా తిరిగి ఇస్తారో లేదో? ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియదు. అందుకే దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించాలనుకుంటున్నాం’ కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మండలం రంగాపూర్​ గ్రామ సర్పంచ్ బింగి కరుణాకర్​ చెప్పిన మాటలివి. అసలైన సమయంలో సర్పంచులు తిరుగుబాటు చేస్తున్నారు. గతంలో కూడా పల్లె ప్రగతి సందర్భంగా సమావేశాలను బహిష్కరించారు. గ్రామాలలోకి అధికారులు రావద్దంటూ అడ్డకున్నారు. చివరకు ఎమ్మెల్యేల ఒత్తిడితో ‘ఏదో చేశామంటే చేశాం’ అనే రీతిలో కంప్లీట్​ చేశారు. ఇప్పటికే గ్రామాలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. మండల కార్యాలయాలలో ఆందోళన చేస్తున్నారు. అయినా, బిల్లులు రావడం లేదు. ఇలాంటి సమయంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు రావడంతో ఎదురుదాడి మొదలుపెట్టారు. తమ దగ్గర చిల్లిగవ్వ లేదని, వేడుకలను నిర్వహించమంటున్నారు. 

బిల్లులెట్లా రావాలె?
నిరుడు ఆగస్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు వేయాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్​విడుదల చేయడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న15వ ఆర్థిక సంఘం నిధులు నెల నెలా కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు, వీధి దీపాల నిర్వహణ కే సరిపోతున్నాయి. కొన్నిచోట్ల జీతాలను ఇతర నిధుల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారు. ఒక్కో పంచాయతీలో దాదాపు రెండు నెలల వేతనాలు ఇప్పటికీ పెండింగ్​లోనే ఉన్నాయి. రాష్ట్రంలోని దాదాపు పదివేల గ్రామ పంచాయతీలలో ప్రస్తుతం నిధులు జీరోగా ఉన్నాయి. ఈ పరిస్థితులలో సర్పంచులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ, అప్పులు తేవడం తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితులలో దశాబ్ది ఉత్సవాలకు ఎక్కడ నుంచి పైసలు తేవాలని చాలామంది సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది సర్పంచులు ఈ వేడుకలను బహిష్కరించాలని భావిస్తున్నారు. నిజానికి, పల్లె ప్రగతి ద్వారా పంచాయతీలలో ఖర్చుల భారం పెరిగింది. చిన్న గ్రామపంచాయతీకి ప్రతి నెలా కరెంటు బిల్లులు రూ. 45,000 దాటుతున్నాయి. ఇక, సిబ్బంది జీతాలు మరో రూ. 45,000, ట్రాక్టర్ డీజిల్ రూ. 5000, ఇతర ఖర్చులు రూ. 5 వేలు కలుపుకుని నెలకు రూ. లక్షకుపైనే వెచ్చించాల్సి వస్తున్నది. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఆదాయాన్ని ప్రభుత్వం తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నది. పంచాయతీలకు రావాల్సిన ఇంటి పర్మిషన్లు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫీజు, మైనింగ్ సీనరేజిని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో గ్రామాలలో చేపట్టిన పనులకు బిల్లులు రాక కొందరు సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే అత్యవసర పనులకు సంబంధించి ప్రతి సర్పంచ్ కు రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల బిల్లులు బాకీ ఉన్నారు. వీటికి సంబంధించిన ఎంబీ రికార్డులు పూర్తయి కూడా బిల్లులు కోసం వెయిటింగ్​లో ఉన్నారు. 

పాత బిల్లులు కంప్లీట్​ కాలేదు
ఇటీవల సీఎం కేసీఆర్ రూ. 1159 కోట్లు గ్రామపంచాయతీలకు విడుదల చేస్తున్నామని ప్రకటించిన విషయంలో తెలిసిందే. ఈ నిధులతో గతంలో పనిచేసిన క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, వైకుంఠధామాలకు సంబంధించిన బిల్లులు, సీసీ రోడ్లకు కొన్ని, మన ఊరు మనబడి కి చెందిన కొన్ని బిల్లులకు ఈ నిధులు జమ చేశారు. నిధుల ఉత్తర్వులను జమ చేసినప్పటికీ.. ఇంకా వాటికి సంబంధించిన డబ్బులు మాత్రం క్రెడిట్​ కాలేదు. దీంతో ఈ బిల్లులు ఇంకా క్లియర్​కాలేదు. అంతేకానీ, పంచాయతీలకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదు. గత 10 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్​ఒక్క రూపాయి కూడా వేయడం లేదు. 

బాబ్బాబు.. ప్లీజ్​
పలు గ్రామాల్లో దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సర్పంచ్​లు ముందుకురాకపోవడంతో.. మండల అధికారులు బతిమిలాడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటం, గ్రామాల్లో కనీసం జెండావిష్కరణ చేసేందుకు కూడా ప్రథమ పౌరులు వెనకాడుతుండటంతో అధికారులకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నది. దీంతో పలుచోట్ల అధికారులు.. సర్పంచ్​ల ఇంటికి వెళ్లి బతిమిలాడుతున్నారు. ఉత్సవాలను నిర్వహించాలని చెప్తున్నారు. 

ఎమ్మెల్యే ఏమైనా ఇస్తారా?
దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు తమ సెగ్మెంట్ ఎమ్మెల్యే నుంచి ఏమైనా ఖర్చులకు డబ్బులు పంపిస్తారా అంటూ సర్పంచులు అడుగుతున్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులకు ఎమ్మెల్యేల నుంచి వ్యక్తిగత ఆర్థికసాయంపై కొంత ఆశలు ఉన్నా, ఇతర పార్టీలకు చెందిన సర్పంచులకు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఇవ్వాలంటే ఎమ్మెల్యేలు కూడా వణుకుతున్నారు. దశాబ్ధి ఉత్సవాల నిర్వహణకు ప్రతి గ్రామానికి కనీసం రూ. 50వేలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత సొమ్మును ఎన్నికల ముందే ఇవ్వడంపై ఆయోమయంలో పడుతున్నారు. దీంతో దశాబ్ది ఉత్సవాలు ఎమ్మెల్యేలకు కూడా ఆర్థిక కష్టాలు తెచ్చి పెట్టింది. 

మా దగ్గర పైసల్లేవ్​
ఇప్పటికే పల్లె ప్రగతి పనులకు సంబంధించిన బిల్లులు రాలేదు. పంచాయతీలలో కనీస నిర్వహణ బిల్స్​ కూడా రావడం లేదు. రోజుకో అధికారి వస్తున్నారు. వారి ప్రొటోకాల్​కోసమే వేలు ఖర్చు పెడుతున్నాం. ఆ పైసలు కూడా రావడం లేదు. ఇప్పుడు దశాబ్ధి ఉత్సవాలకు కనీసం రూపాయి ఇవ్వకుండా ఘనంగా నిర్వహించాలంటే ఎలా? మా దగ్గర పైసల్లేవ్​. అందుకే ఉత్సవాలను నిర్వహించడం కష్టమే. – నేరేళ్ల మహేందర్, సర్పంచ్​, చెల్పూరు

నిర్వహణకు ఇబ్బంది 
పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే కూడా భయం అవుతుంది. చేతినుంచి ఖర్చు పెట్టడమే తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి రావడం లేదు. స్టేట్​ ఫండ్స్​ పది నెలల నుంచి ఆగిపోయాయి. 15వ ఆర్థిక ఫైనాన్స్​ వస్తే.. కరెంట్ బిల్లులకే సగం ఆపుకుంటున్నారు. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలను ఎలా నిర్వహించాలో కష్టంగానే మారింది.– రవీందర్​రెడ్డి, సర్పంచ్​, గుండ్లపల్లి, సైదాపూర్​మండలం