కల్వకుంట్ల కుటుంబం ‘దారి’ దోపిడీకి పాల్పడ్డరు

కల్వకుంట్ల కుటుంబం ‘దారి’ దోపిడీకి పాల్పడ్డరు
  • కేటీఆర్ ధన దాహానికి ఓఆర్ఆర్ బలైంది
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్​లా ఇదికూడా ఒకటి
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ ధన దాహానికి ఓఆర్ఆర్ బలైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్​ లో నిర్వహించిన సమావేశంలో రేవంత్​రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం దారి దోపిడీకి, దొంగతనానికి పాల్పడిందన్నారు. బేస్ ప్రైస్ లేకుండా ఓఆర్ఆర్ టెండర్లు పిలవడంపై ప్రశ్నించినట్లు వెల్లడించారు. 30 రోజుల్లోగా 10శాతం , 120 రోజుల్లోగా పూర్తి డబ్బు ఐఆర్బీ సంస్థ చెల్లించాలని నిబంధన ఉందన్నారు. మేం ప్రస్తావించిన నిబంధనలపై అలాంటివి లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుకాయించారని తెలిపారు. డబ్బు చెల్లింపునకు సంబంధించి కన్సిషన్ అగ్రిమెంట్ లో స్పష్టంగా ఈ నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.అగ్రిమెంట్లోని 20, 21 పేజీలో తాము చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. తాను చెప్పింది 10శాతమే కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25 శాతం టెండర్ పొందిన సంస్థ చెల్లించాలని ఉందన్నారు. ఏప్రిల్ 27, 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగిందని, ఈరోజుతో 30 రోజుల గడువు ముగిసిందని రేవంత్​తెలిపారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఐఆర్​బీ సంస్థ టెండర్ ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. లిక్కర్ దందా విషయంలో టెండర్ నిబంధనలు సరళీకృతం చేసి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారని ఆరోపించారు. 

రూ.100 కోట్ల స్కాం..
లిక్కర్ దందాలో కేసీఆర్ కుటుంబం రూ.100 కోట్ల స్కాం చేసిందని రేవంత్​ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లాగా.. ఓఆర్ఆర్ కూడా పెద్ద స్కాం అని అన్నారు. తాను చెప్పింది, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చెప్పింది ఒక్కటేనని అన్నారు. మరి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓఆర్ఆర్ అంశంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని, దీని వెనక గూడుపుఠానీ ఏంటని ప్రశ్నించారు.  మేం బయటపెట్టిన నిబంధనలు నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్ పై ఉందని తెలిపారు. రఘునందన్ ఓఆర్ఆర్ టెండర్ పై సీబీఐకి ఫిర్యాదు చేశారని, సొంత ఎమ్మెల్యే ఫిర్యాదును బండి సంజయ్, కిషన్ రెడ్డి నమ్ముతున్నారా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై కేటీఆర్, లేదా అరవింద్ కుమార్ స్పందించాలని డిమాండ్​చేశారు.

సీఎం, పీఎం అవిభక్త కవలలు ..
కాంగ్రెస్ ను అడ్డుకోవడమే బీఆర్ఎస్​లక్ష్యమని, బీజేపీ, బీఆర్ఎస్​ఒక్కటేనని అన్నారు. సీఎం కేసీఆర్, పీఎం  మోదీ అవిభక్త కవలలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు ఆవేశంలో బీజేపీలో చేరారని, ఆ తరువాత అసలు సంగతి తెలుసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ను ఓడించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలని తాను అందుకే చెప్పానని తెలిపారు. నిరుద్యోగ ఖాళీలపై సీఎం శాసనసభలో చెప్పింది అబద్ధమా? గంటా చక్రపాణి గవర్నర్ కు ఇచ్చిన నివేదిక అబద్ధమా? అని ప్రశ్నించారు. 110  నెలల్లో లక్షా 10వేల మంది ఉద్యోగ విరమణ చేశారని రేవంత్​రెడ్డి చెప్పారు.