ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది
  • వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టాం
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ముషీరాబాద్, ముద్ర: భారీ వర్షాల నేపధ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే విధంగా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని, ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టిందని తెలంగాణ  రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టంతో పాటు దిగువకు నాలోకి విడుదల అవుతున్న నీటిని శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ జియా ఉద్దిన్, ఎస్ఎన్ డిపి సిఈ సురేష్, హెచ్ఎండిఎ ఎస్ఈ పరంజ్యోతి, తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. హుస్సేన్ సాగర్ లో ప్రస్తుత నీటిమట్టం ఎంత ఉంది, ఎంత ఇన్ ఫ్లో ఉంది, ఔట్ ఫ్లో ఎంత వెళుతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మారుతీ నగర్ లో హుస్సేన్ సాగర్ నాలా అభివృద్ధి పనులను, అశోక్ నగర్ వద్ద హుస్సేన్ సాగర్ నాలాపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి తలసాని పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో  ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు నగరంలో 437 జీహెచ్ఎంసీ బృందాలు, 27 డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని వివరించారు.

 జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ప్రజల నుండి వచ్చే పిర్యాదులపై  ఎప్పటికప్పుడు అధికారులు స్పందిస్తున్నారని చెప్పారు. హుస్సేన్ సాగర్ కు ఎగువ నుండి భారీగా నీరు వస్తున్న కారణంగా నిండు కుండలా మారిందని, ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం జరుగుతుందని చెప్పారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. హుస్సేన్ సాగర్ నుండి దిగువకు నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో నాలా వెంట ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు.  వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని ఈ సందర్బంగా మంత్రి అభినందించారు. ఇంతకు ముందు నగరంలోని బేగంపేట, అంబర్ పేట, ముషీరాబాద్, రసూల్ పురా, పికెట్ తదితర అనేక ప్రాంతాలలో వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. పూడిక పెరుకపోవడం, నాలాలను ఆక్రమించుకోవడం వలన నీటి ప్రవాహం సరిగా జరగక ముంపు సమస్య ఉత్పన్నమయ్యేదని వివరించారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ ఎన్ డి పి ) ద్వారా నాలాలను  పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.  

నాలాల పై ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుందన్నారు. మూసీనది పై ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.  రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర సేవల కోసం ప్రజలు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిసీ శంకరయ్య, శానిటరీ డీఈ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ డీజీఎం శశాంక్, హార్టికల్చర్ అధికారి గణేష్, స్టీల్ బ్రిడ్జ్ ఈఈ గోపాల్, డీఎంసీ తిప్పర్తి యాదయ్య, ఏఎం ఓహెచ్ మైత్రి, జిహెచ్ఎంసి డిఈ సన్నీ, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, బిఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, గాంధీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ రాకేష్ కుమార్,  బిఅర్ఎస్ నాయకులు మూట నరేష్, జైసింహ,  సాయి కృష్ణ, పోతుల శ్రీకాంత్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.