ఇక స్నేహబంధం

ఇక స్నేహబంధం
  • గవర్నర్ కు, సర్కారుకు మధ్య కుదిరిన సయోధ్య!
  • సఖ్యతగా ఉండాలని కేంద్రం నుంచి రాజ్ భవన్ కు ఆదేశాలు!!
  • పెండింగు బిల్లులకు 15 లోగా తమిళిసై ఆమోదం

ముద్ర, తెలంగాణ బ్యూరో:నిన్నమొన్నటి వరకు నిప్పు ఉప్పుగా ఉన్న రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య స్నేహం చిగురిస్తోందా! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక నుంచి ఇరువర్గాలు కలిసికట్టుగా పని చేసేలా సమన్వయం కుదిరిందని సమాచారం. గవర్నర్ వీలు దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రాష్ట్ర మంత్రులు కూడా అంతేస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తరుచూ విభేదాలు భగ్గుమనేవి. ఇప్పుడిదంతా గతం కానుందని అంటున్నారు. రాజ్ భవన్ నుంచే వచ్చే ఆదేశాలు, సూచనలు, సలహాలను ప్రగతి భనన్ స్వీకరించనుందని, ప్రగతిభవన్ నుంచి వచ్చే బిల్లులు, ఇతర అభ్యర్థనలకు గవర్నర్ కార్యాలయం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో సఖ్యతగా ఉండాలని  కేంద్రం నుంచి తగు ఆదేశాలు గవర్నర్ కు అందాయని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఇటీవల రెండు పర్యాయాలు హైదరాబాదుకు వచ్చారు. ఆమెకు స్వాగతం పలికేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై, పరస్పరం గౌరవంగా పలకరించుకున్నారు. విమానాశ్రయంలోనే కొంతసేపు సరదగా గడిపారు. గతంలో ఇలా ఉండేది కాదు. 

బిల్లులకు మోక్షం

ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను 15లోగా క్లియర్‌ చేస్తామని  గవర్నర్ కార్యాలయం నుంచి  ప్రగతిభవన్ కు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్‌, ప్రైవేట్‌ యూనివర్సిటీ బిల్లులు  గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటి మీద వివాదం సుప్రీకోర్టులోనూ పెండింగులో ఉంది. గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ సమావేశాలలో  రాష్ట్ర ప్రభుత్వం 11  బిల్లులను తీసుకొచ్చింది. విశ్వ విద్యాలయాలలో నియామకాల కోసం ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయడం, సిద్దిపేట జిల్లా ములుగులోని ‘అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ’ను ‘తెలంగాణ అటవీ విశ్వ విద్యాలయం’గా మార్చడం, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల అనుమతికి చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ చట్టం, పురపాలక చట్టం, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులు ఇందులో ఉన్నాయి. వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపగా, మిగిలిన పది బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వివాదం సుప్రీంకు చేరడంతో మరో మూడు బిల్లులను గవర్నర్ ఆమోదించారు. రెండింటిని వెనక్కి పంపారు. రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు. మూడింటిని తన వద్దే ఉంచుకున్నారు. వీటి మీద ఇప్పటికీ స్పష్టత లేదు. పెండింగులో ఉన్న బిల్లులను కూడా మరో ఐదు రోజులలో ఆమోదిస్తామనే సమాచారం అందడంతో ప్రభుత్వ వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి.