తొమ్మిదేళ్లలో ఏరో స్పేస్ రంగంలో అద్భుత ప్రగతిని సాధించాం

తొమ్మిదేళ్లలో ఏరో స్పేస్ రంగంలో అద్భుత ప్రగతిని సాధించాం

ఏరోస్పేస్ డిఫెన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్​, ముద్ర: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కే.తారకరామారావు ఎరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు, ఏరోస్పేస్ డిఫెన్స్ స్టార్ట్ అప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. గత తొమ్మిదేళ్లలో ఏరో స్పేస్ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని మంత్రి తెలిపారు. అనేక అమెరికన్ కంపెనీలు తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, ఆదిభట్ల ఏరో స్పేస్ సెజ్ గురించి ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని తెలిపారు.

ప్రభుత్వ టీఎస్​ ఐ పాస్​విధానాన్ని ప్రత్యేకంగా వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏరోస్పేస్ డిఫెన్స్ రంగం అత్యంత ప్రాధాన్యత రంగం అన్న మంత్రి కేటీఆర్, 2018–20ఏళ్లలో ఏరో స్పేస్ రంగానికి సంబంధించి తెలంగాణ ఉత్తమ రాష్ట్ర అవార్డుని అందుకుందన్నారు. ఈ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అనేక అవార్డులతో ఏరో స్పేస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణనే అత్యుత్తమ గమ్యస్థానం అన్న విషయం నిరూపితమైందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో తమ కార్యకలాపాల పట్ల సానుకూలపైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ సప్లై చైన్ లో ఉన్న ఇతర కంపెనీలను కూడా తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు.