నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు..

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు..

జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జె.  సురేందర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విత్తనాల సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా కొందరు వ్యాపారులు, మధ్య దళారులు రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలు విక్రయించే అవకాశం ఉందని అన్నారు. నకిలీ విత్తనాల సరఫరాను, నాసిరకం ఎరువులను అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల ఆన్నదాతలు మోసపోకుండా సమర్దవంతంగా పనిచేయాలని చెప్పారు. నకిలీ విత్తనాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా  జిల్లాలో నేరాల నియంత్రణపై చేపట్టిన చర్యలు, పెండింగులో ఉన్న కేసుల వివరాలను ఎస్పి అడిగి తెలుసుకున్నారు.   ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలని కోరారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో చిత్తశుద్దితో పని చేయాలని సూచించారు. నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసి టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా  నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. 
పోక్సో కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ(ఏఆర్) వి శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి ఏ.రాములు, వర్టికల్ డీఎస్పి కిషోర్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.