కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది..

కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది..
  • ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..
  • పార్టీ ఫిరాయించిన వారికి తగిన బుద్ధి చెప్తాం..
  • కాంగ్రెస్ పాలనలో మెరుగైన పథకాలు..
  • టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటుందని టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా మంగళవారం ఆయన భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కేసీఆర్ అనేక వాగ్దానాలు చేసి విస్మరించాడన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, నిరుపేద దళితులకు మూడెకరాల చొప్పున సాగుభూమి ఇస్తానని మోసం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పారు. పాలన సౌలభ్యం కోసం అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొర గడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించాడని, ఈ ప్రాంత కార్యకర్తల అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించిన సన్నాసులకు తొందరలోనే బుద్ది చెబుతామన్నారు.

వంద మందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నవా? అని స్థానిక ఎమ్మెల్యే నుద్దేశించి మండిపడ్డారు. నేను తలుచుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదని హెచ్చరించారు. రెండు పార్టీలు ఒకే రోజు సభ పెట్టకూడదని మేం ఆ రోజు యాత్రకు విరామం ఇచ్చామని, ఇవాళ ఆవారా గాళ్లు దాడులుచేస్తే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ఎస్పీ చుట్టమనే ఇలా వ్యవహరించారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

కార్మిక సంఘాల్లో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు..
- సీఎం కూతురు కార్మికుల సమస్యలు పరిష్కరించిందా..?
- సింగరేణి గేట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి

కార్మిక సంఘాల్లో కూడా వారి కుటుంబమే గుత్తాధిపత్యం చెలాయిస్తుందని, సీఎం కూతురు గౌరవ అధ్యక్షురాలుగా ఉండి బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించిందా.? అని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఉదయం సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆనాటి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని, సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించడం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని తెలియజేప్పారు.

కార్మీకుల సంఘాల్లో ఉన్నది వేలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టడానికే తప్ప, కార్మికుల సమస్యలు తీర్చడానికి కాదని అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆర్ ఎస్ అవిభక్త కవలల్లా కలిసి ఉన్నారని, కానీ ఇప్పుడు వేరుగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించారని, ప్రజా వ్యతిరేకత చూసి భయంతో వేరుగా ఉన్నామని చూపే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తాడిచర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు.. తాడిచర్ల మైన్ లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత.? తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్ ను ఆదానికి అమ్మేస్తే... దానిపై కాంగ్రెస్ ఎంపీలందరం కొట్లాడామని, అందుకే నైని కోల్ మైన్ అమ్మకం ఆగిపోయిందన్నారు.

ప్రతిమా శ్రీనివాస్ కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? మండిపడ్డారు. కేసీఆర్,  మోదీలది కార్పోరేట్ ఫ్రెండ్లీ విధానమని ఎద్దేవా చేశారు. శ్రీధర్ ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్ కు ఉన్న ఉపయోగం ఏమిటో ఆలోచించాలని, లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని, వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణకు తప్పకుండా అదేశిస్తామన్నారు. సింగరేణిని లాభాల బాటలో పయనించేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని, ఎవరు అధికారంలో ఉంటే కార్మికుల కష్టాలు తీరుతాయో కార్మీకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం వివిధ కళాశాలల విద్యార్థినులచే మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థులకు ఉన్న శక్తి ఎవరికీ లేదని, దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగ నియమకాలు లేకుండా చేస్తున్నారని, వివిధ సంస్థలను ప్రైవేటుకు అమ్ముతున్నారని రాబోయే రోజుల్లో అవినీతి పాలకులకు బుద్ది చెప్పి స్వచ్ఛమైన పాలన అందించే కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, అంజన్ కుమార్, మహబూ బాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి,  భూపాలపల్లి డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి,  ఐఎన్ టియుసి నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.