‘ప్రజాపాలన’కు ఏర్పాట్లు పూర్తి

‘ప్రజాపాలన’కు ఏర్పాట్లు పూర్తి

మహాదేవపూర్: ముద్రమండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారెంటీ పథకాల్లో లబ్ధి పొందేందుకు ‘ప్రజాపాలన’ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని సర్పంచ్ శ్రీపతిబాపు తెలిపారు. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గ్రామ ప్రజలు ప్రజాపాలన గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సౌకర్యం కోసం షామియానాలు మంచినీళ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే సదుద్దేశ్యంతో, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ సభలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ చల్ల తిరుపతిరెడ్డి అన్నారు. వృద్దులు, వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు, కనీస సౌకర్యాలు కల్పించాలని, రద్దీ పెరుగకుండా దరఖాస్తులు తీసుకోవాలని జెడ్పీటీసీ గుడాల అరుణ అన్నారు. ప్రజలకు దరఖాస్తు ఫారంలను ఇంటింటికి అందజేయడం జరుగుతుందని కార్యదర్శి సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, వార్డు సభ్యులు ఎండీ ఉస్మాన్ ఖాన్, భీముని వెంకటస్వామి, నూకల గట్టమ్మ, మేసినేని రవి చందర్, రెబ్బ అనిత, పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు నర్సిన కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.