దివ్యాంగులకు అండగా కేంద్ర ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా కేంద్ర ప్రభుత్వం

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు. బుదవారం కరీంనగర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ, అలీమ్ కో సహకారంతో వికలాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణి కార్యక్రమంలో  కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హుజురాబాద్, కరీంనగర్ డివిజన్ లలో నిర్వహించిన ఎంపిక శిబిరాలలో దివ్యాంగుల వివరాలు సేకరించి వారందరికీ ప్రస్తుతం ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కోన్నారు. ప్రస్తుతం సుమారు 731 మంది దివ్యాంగులు సహాయ ఉపకరణాలకు ఎంపికయ్యారని, ఈ ఉపకరణాల విలువ 68 లక్షల 28 వేలుగా ఉందని తెలిపారు. వీరందరికీ గతంలోనే సహాయ ఉకరణాలు పంపిణీ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జాబితాలో పేరు రానివారికి, కొత్తగా దరఖాస్తు చేసే వారి కోసం మళ్లీ అవకాశం ఇస్తామని అన్నారు. ప్రతి వికలాంగుడికి సహాయపడే ప్రతి సహాయ ఉపకరణాన్ని అందజేస్తామని తెలిపారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని. మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్ లైన్, పోషణ్ అభియాన్ వంటి అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా తల్లి తండ్రి లేని పిల్లలకు ఆర్థిక సాయం కల్పిస్తుందని. మహిళలకు భరోసా తో పాటు పోలీసు, న్యాయ సహాయం కూడా అందజేస్తున్నదని తెలిపారు. ప్రతి పిల్లవాడు పనిలో కాకుండా పాఠశాలలోనే ఉండాలన్న ధ్యేయంతో ముందుకు వెళుతుందని అన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందించడంలోనూ కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సిడిపిఓ భాగ్యలక్ష్మి, ఏసిడిపిఓలు సౌందర్య, అరవింద, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అలింకో సిబ్బంది రవిశంకర్, అంకిత్ రాయ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.