భూపాలపల్లి అసెంబ్లీ బరిలో 23మంది..

భూపాలపల్లి అసెంబ్లీ బరిలో 23మంది..
  • 8మంది స్వతంత్ర అభ్యర్థులు..
  • బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 23అభ్యర్థులు ఎమ్మెల్యే పోటీలో ఉన్నారు. ఇందులో 15మంది వివిధ పార్టీల నుండి బరిలో నిలువగా 8మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిల్చున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ నుండి చందుపట్ల కీర్తిరెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ నుండి గజ్జి జితేందర్, బీఆర్ఎస్ నుండి గండ్ర వెంకటరమణా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి గండ్ర సత్యనారాయణ రావు, ఆబాద్ పార్టీ నుండి అడ్లకొండ స్రవంతి, ఎంసీపీఐ నుండి అస్రఫ్ మహమ్మద్, ధర్మ సమాజ్ పార్టీ నుండి కొత్తూరి రవీందర్, భారత్ సమాజ్ డెవలప్ పార్టీ నుండి చేపూరి ఓదెలు యాదవ్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుండి పెండెల దేవరాజ్, సీపీఐ(ఎంఎల్)ఎల్ నుండి మారపల్లి మల్లయ్య, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి రత్న పోషమ్మ, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ నుండి ఎస్.రమేష్ గుప్త, అలియన్స్ ఆఫ్ డెమాక్రటిక్ రెఫార్మ్స్ పార్టీ నుండి తాళ్లపల్లి రమేష్ గౌడ్, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నుండి వంగర సాంబయ్య, జన శంఖారావం పార్టీ నుండి సాద అఖిల్ రెడ్డి తో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా అల్లం మహేశ్, తీన్మార్ రవి పటేల్, పొన్నం బుచ్చయ్య, జి.రజిని, వావిలాల లక్ష్మణ్, మంతెన సంపత్, గొడుగు సాహిత్, సిరిపెల్లి రాజయ్య లు ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కూడా కేటాయించారు. 

మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ..

 భూపాలపల్లి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావులు పోటాపోటీగా విరామమెరగకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో గ్రామ గ్రామాన తిరుగుతూ ఆశీర్వదించాలని, ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. మూడు పార్టీల అభ్యర్థులు తిరుగుతున్న ప్రచారాలను బట్టి చూస్తే ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతూ ఉండడంతో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడింది.

భూపాలపల్లి నియోజకవర్గంలో 2,73,633 మంది ఓటర్లు..

భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 2,73,633 మంది ఓటర్లు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి మండలంలో 77,077 మంది ఓటర్లు, చిట్యాల మండలంలో 30,329 మంది, గణపురం మండలంలో 31,909 మంది, మొగుళ్ళపల్లి మండలంలో 29,854 మంది, ఉమ్మడి రేగొండ మండలంలో 49,290 మంది, శాయంపేట మండలంలో 33,459 మంది, టేకుమట్ల మండలంలో 21,715 మంది ఓటర్లు ఉన్నారు. ఈనెల 1న తుది జాబితా విడుదల చేయగా 2,68,023 మంది ఓటర్లు నమోదయ్యారు. కాగా ఈ నియోజకవర్గంలో కొత్తగా 5,610 మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోగా 2,73,633 ఓటర్లు అవుతున్నట్లు అధికారులు తెలిపారు.