ఆస్తుల సంపాదన కోసమే పార్టీ మారిన ఎమ్మెల్యే..

ఆస్తుల సంపాదన కోసమే పార్టీ మారిన ఎమ్మెల్యే..
Gandra Satyanarayana Rao is the in-charge of Bhupalappalli Constituency of the Congress Party
  • జోడోయాత్రలో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  ఆస్తులను సంపాదించుకోవడం కోసమే ఎమ్మెల్యే గండ్ర.వెంకటరమణారెడ్డి పార్టీ మారాడని టిపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నాలుగవ రోజు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డిలు పార్టీ నాయకులతో కలిసి ఆదివారం భూపాలపల్లి పట్టణంలోని రాజీవ్ నగర్, కారల్ మార్క్స్, యాదవకాలనీ, కృష్ణ కాలనీ, టి2 క్వార్టర్స్, జవహర్ కాలనీ, జయశంకర్ కాలనీ, పైలట్ కాలనీ, సత్తార్ నగర్ లలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయకపోగా తన సంపాదనే ముఖ్యమని ముందుకు సాగుతున్నాడని విమర్శించారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. గోదావరి జలాలు నియోజకవర్గ తలాపునే పారుతున్నా, భూపాలపల్లి పట్టణానికి తాగునీరు అందించిన దాఖలాలు లేవని, భూపాలపల్లి పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తానని గత ఎన్నికల ముందు చెప్పిన ఎమ్మెల్యే ఆ హామీని మర్చిపోయారని అన్నారు. 


సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆ ఖాళీల భర్తీపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టకపోవడం ఈ ప్రాంతవాసుల దురదృష్టకరమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కాలనీలవాసులు  ఎదుర్కొంటున్న సమస్యలను గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకురాగా, రానున్న రోజుల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు  చల్లూరి మధు, భూపాలపల్లి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువనసుందర్, ఎన్ఎస్ యుఐ జిల్లా ప్రెసిడెంట్ భట్టు కరుణాకర్, ఐఎన్ టియుసి నాయకులు జోగు బుచ్చయ్య, బుర్ర కొమురయ్య, తోట సంతోష్, 5వ వార్డు కౌన్సిలర్ ఉడుత సరోజన- రాయమల్లు, కౌన్సిలర్ దాట్ల శ్రీను, ఫజిల్, పిప్పాల రాజేందర్, హఫీజ్, కిషోర్ రెడ్డి, పొనకంటి శ్రీను, డాక్టర్ రమేష్, ఉడుత మహేందర్, కర్రు రాజేందర్, మధుకర్ రెడ్డి, ఉస్మాన్, రజినీ కాంత్, చరణ్, తోట రంజిత్, పృథ్వీ, పోలినేని లింగారావు, తక్కళ్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.