మణిపూర్ లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి

మణిపూర్ లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి
  • ఎమ్మెల్సీ రాజేశ్వరరావు

ముద్ర, ముషీరాబాద్:మణిపూర్ లో జరుగుతున్న విధ్వంసకాండను ఆపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఉనను ట్రైబల్ ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్రంలో నివాసం ఉంటున్న మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మిజోరాం వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ శాంతియుత ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో పాటు... పలువురు క్రైస్తవ సంఘాల మత పెద్దలు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఒక జాతి వారు చర్చిలను ధ్వసం చేయడంతో పాటు క్రైస్తవులపై దాడులు చేస్తూ హింసాత్మకంగా చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోం శాఖమంత్రి అమిషా గొడవలు జరిగిన ప్రాంతంలో పర్యటించినప్పటికీ అక్కడ ఫైరింగ్ నిరోధించకపోవడం దారుణమన్నారు. దాడుల్లో 92 మంది చనిపోయారని ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ, అమిషా పరిస్థితిని అదుపు చేయకుండా అల్లరిముకలను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను కాపాడటానికి మాత్రం ప్రయత్నించడం లేదన్నారు. కర్నాటక ఎన్నికల్లో మైనారిటీలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, విధంగా రానున్న రోజుల్లో దేశంలో కూడా బీజేపీ కి అదే గతిపడుతోందన్నారు. దేశంలో మైనారిటీలు, క్రైస్తవుల మీద దాడి చేయించే పాలకులను దేవుడు నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఆదిలాబాద్ ఎంపీ బాబూరావు క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశంలో క్రైస్తవులు మతం మార్చేవారు కాదని, ప్రజలకు మేలు చేసే వారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని వీలైనంత త్వరగా పరిస్థితులు అదుపు చేసి అక్కడ ప్రజలు శాంతియుతంగా జీవించే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ రాజేశ్వరరావు డిమాండ్ చేశారు.