అగ్ని వీరుల ఎంపిక.. తెలంగాణలో నాలుగు కేంద్రాల ఏర్పాటు

అగ్ని వీరుల ఎంపిక.. తెలంగాణలో నాలుగు కేంద్రాల ఏర్పాటు
Selection of Agni Veera.. Establishment of four centers in Telangana

హైదరాబాద్‌: అగ్ని వీరుల నియామకానికి  నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్ష కోసం రాష్ట్రంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆర్మీ నియామక అధికారి కీట్స్‌ కె.దాస్‌ తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆర్మీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్దేశించిన పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాతనే ప్రక్రియ పూర్తవుతుందని, ఆయా అభ్యర్థులకు హాల్‌ టికెట్లు పంపిస్తామని కీట్స్‌ తెలిపారు. ఐటీఐ లేదా పాలిటెక్నిక్‌ అభ్యర్థులకు 20 నుంచి 50 మార్కుల వరకు బోనస్‌గా లభిస్తాయని ఆయన వెల్లడించారు.

అభ్యర్థులకు సందేహాలుంటే 79961 57222 నెంబర్ కు వాట్సాప్ చేయాలని ఆర్మీ నియామక అధికారి తెలిపారు.  త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌'  స్కీమ్‌ కింద నిర్వహించే అగ్నివీరుల నియామక పరీక్షకు నోటిఫికేషన్‌  విడుదలైంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జోన్‌ల వారీగా నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుద చేసిన విషయం తెలిసిందే. రెండు దశల్లో చేపట్టే ఈ ఎంపిక ప్రక్రియలో తొలుత ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్‌ 17నుంచి అగ్నివీర్‌ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది.