విదేశీ సినిమాలు చూస్తే ఏకంగా జైలుకే

విదేశీ సినిమాలు చూస్తే ఏకంగా జైలుకే
North Korean dictator Kim Jong Un restricted on foreign movie

ప్యొంగ్యాంగ్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విచిత్ర పాలన అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రూరత్వం రోజు రోజుకు ఎక్కువగా పెరుగుతుండటంతో ఉత్తర కొరియా వాసులు నిత్య నరకం అనుభవిస్తున్నారు.  తాజాగా ఆయన దృష్టి హాలీవుడ్‌ సినిమాలపై పడింది. హాలీవుడ్‌ సినిమాలు చూసి ఎవరైనా ప్రభావితమై తిరుగుబాటు లేవదీస్తారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఏకంగా హాలీవుడ్‌ సినిమాలు లేదా విదేశీ సినిమాలను ఇంట్లో చూస్తూ దొరికిపోతే ఆ పిల్లల తల్లిదండ్రులను ఏకంగా జైలుకు పంపిస్తామని ప్రకటించారు. గతంలో ఆ సినిమాలు చూస్తూ దొరికితే తీవ్రంగా హెచ్చరించి విడిచిపెట్టేవారు. అయితే పాశ్చాత్య విధానాలు దేశంపై పడకూడదన్న కఠిన నియమాల్లో భాగంగా తాజా ఆదేశాలు వెలువరించడం గమనార్హం.

మొదట సినిమాలు చూస్తూ దొరికిపోతే తల్లిదండ్రులను కార్మిక శిబిరాలకు తరలిస్తారు. అక్కడ ఆరు నెలల పాటు వారు ఉండాలి. వారి పిల్లలను మాత్రం ఐదేళ్లు శిక్ష విధించి శిబిరాలకు పంపిస్తారు. పిల్లలకు వారి తల్లిదండ్రులు ఉత్తర కొరియా విశిష్టత గురించి తెలియజేయాలి లేకపోతే సామ్యవాద వ్యతిరేకులుగా మారే ప్రమాదముందని అధికారులు పేర్కొన్నారు. గతంలో దక్షిణ కొరియా సినిమాల క్యాసెట్లను సరఫరాచేస్తూ ప్రదర్శించిన ఇద్దరు బాలలకు మరణశిక్ష విధించినట్టు దక్షిణ కొరియా మీడియాసంస్థలు పేర్కొన్నాయి. గత నెలలో ఎవరైనా అశ్లీల చిత్రాల వీడియోలను వీక్షిస్తున్నట్టు సమాచారమందితే వారిని కాల్చిచంపాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ప్రజలు తమ కిష్టమైన ఇతర దేశాల సినిమాలు చూడలేక ఊసురుమంటున్నారు.