బీబీసీ టీవీ యాంకర్ల  విధుల బహిష్కరణ

బీబీసీ టీవీ యాంకర్ల  విధుల బహిష్కరణ

బీబీసీ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వ విధానాలను విమర్శించిన ఓ టీవీ యాంకర్‌‌ను విధుల నుంచి తప్పుకోవాలంటూ ఆదేశించి సమస్యల్లో పడింది. బాధిత యాంకర్‌కు మద్దతుగా సహచర ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో బీబీసీలో పలు కార్యక్రమాలు అర్ధాంతరంగా రద్దయ్యాయి.  బ్రిటన్‌లో అక్రమ వలసలు నిరోధించేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లులో వలసదారుల మానవహక్కులు కాలరాస్తూ అత్యంత కఠినమైన నిబంధనలు రూపొందించడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో బీబీసీలోని ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ గారీ లైన్కర్ బ్రిటన్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కొత్త చట్టం జర్మనీలో నాజీల నిరంకుశత్వాన్ని గుర్తుకుతెస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీబీసీ యాజమాన్యం ఆయనపై కన్నెర్ర చేసింది. విధుల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ ఆదేశించింది. దీంతో..గారీ నిష్క్రమించారు.  ఈ పరిణామం బీబీసీలో కలకలానికి దారి తీసింది. సహచర ఉద్యోగి భావప్రకటనా స్వేచ్ఛను హరించారంటూ ఇతర యాంకర్లు గళమెత్తారు. విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పలు స్పోర్ట్స్ కార్యక్రమాలు రద్దయిపోయాయి. ఈ ఉదంతం బీబీసీని అపఖ్యాతి పాలు చేసినట్టైంది. ప్రభుత్వానికి, అధికార పక్షానికి వంత పాడుతోందంటూ అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.