Sharath Pulluru: అమెరికాలో తెలుగు యువకుడు శరత్‌ను హత్యచేసిన దోషికి మరణశిక్ష అమలు

Sharath Pulluru: అమెరికాలో తెలుగు యువకుడు శరత్‌ను హత్యచేసిన దోషికి మరణశిక్ష అమలు
  • 22 ఫిబ్రవరి 2002లో శరత్ పుల్లూరు హత్య
  • 41 ఏళ్ల మైఖేల్ డెవేన్ స్మిత్‌ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించిన కోర్టు
  • 22 ఏళ్ల తర్వాత ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు

తెలుగు యువకుడిని హత్యచేసిన అమెరికా వ్యక్తికి అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది.  ఒక్లహామాలో స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల శరత్ పుల్లూరు 22 ఫిబ్రవరి 2002లో దారుణహత్యకు గురయ్యాడు. అదే రోజు జానెట్ మూర్ అనే 40 ఏళ్ల మహిళ కూడా హత్యకు గురైంది. వేర్వేరుగా జరిగిన ఈ హత్యకేసుల్లో అరెస్ట్ అయిన 41 ఏళ్ల మైఖేల్ డెవేన్ స్మిత్‌ను దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది.

అప్పటి నుంచి జైలులోనే ఉన్న స్మిత్‌కు గురువారం జైలు అధికారులు మరణశిక్ష అమలుచేశారు.. మెక్ అలెస్టర్ పట్టణంలోని ఒక్లహామా స్టేట్ ప్రిజన్‌లో ప్రాణాంతకమైన ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలుచేశారు. మరణశిక్ష అమలు అనంతరం ఒక్లహామా అటార్నీ జనరల్ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేస్తూ స్మిత్‌కు మరణశిక్ష అమలుచేయడం ద్వారా 22 ఏండ్ల సుదీర్ఘకాలం తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినట్టు తెలిపింది. కాగా, ఒక్లహామాలో ఓ దోషికి మరణశిక్ష విధించడం ఈ ఏడాది ఇదే తొలిసారి.