బ్రిటన్​లోకి అక్రమంగా ప్రవేశిస్తే రువాండాకు తరలిస్తాం

లండన్‌: దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారిపై ఇక కఠినంగా వ్యవహరిస్తామని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ హెచ్చరించారు. అక్రమ మార్గాల ద్వారా చొరబడే వారిని శరణార్థిగా పరిగణించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. బోట్ల ద్వారా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నవారికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్‌ కొత్తగా తీసుకువచ్చిన విధానానికి సంబంధించిన వివరాలను రిషి సునాక్‌ మీడియా ముందు వెల్లడించారు. 'అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే.. ఇక మీరు శరణార్థిగా ఆశ్రయం పొందలేరు. ఆధునిక బానిసత్వం రక్షణ ప్రయోజనాలను కూడా అందుకోలేరు. నకిలీ మానవ హక్కుల దావాలు కూడా వేయలేరు. మొత్తానికి ఇక్కడ ఉండలేరు' అని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ వెల్లడించారు. 'అక్రమంగా వచ్చిన వారిని నిర్బంధించి.. కొన్ని వారాల్లోనే వారిని సొంత దేశానికి పంపిస్తాం. లేదా అటువంటి వారిని రువాండా వంటి ఇతర దేశాలకు తరలిస్తాం. ఒకసారి ఇలా వెనక్కి పంపినవారిని అమెరికా, ఆస్ట్రేలియా మాదిరిగా తిరిగి బ్రిటన్‌లోకి అడుగు పెట్టకుండా నిషేధిస్తాం' అని రిషి సునాక్‌ స్పష్టం చేశారు. చిన్న పడవల ద్వారా ఇంగ్లీష్‌ ఛానల్‌ను దాటుకొని వచ్చే అక్రమ చొరబాట్లకు తాజాగా తీసుకువచ్చిన బిల్లు అడ్డుకట్ట వేస్తుందని బ్రిటన్‌ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమ వలసలను అరికట్టడం తన ప్రాధానాంశాల్లో మొదటిదని చెబుతోన్న రిషి సునాక్‌.. ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని ప్రకటించారు. చట్టపరంగా దేశంలోకి ప్రవేశించే వారితోపాటు స్థానికులకు ఇలా అక్రమంగా వలసవచ్చే గ్యాంగులవల్ల ప్రమాదం పొంచివుందన్నారు. ప్రస్తుత పరిస్థితి నైతికమైంది కాదని.. అందుకే ఈ బోట్లను అడ్డుకునేందుకే ఈ కొత్త చట్టమని స్పష్టం చేశారు.