తగ్గిన బంగారం, వెండి ధరలు

తగ్గిన బంగారం, వెండి ధరలు

దిల్లీ: దేశంలో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.615 మేర తగ్గి 55,095 వద్ద ముగిసింది. వెండి ధర సైతం కిలోకు రూ.2,285 మేర తగ్గి రూ.62,025 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ధర దిగి వచ్చింది. గత ట్రేడింగ్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55,710 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడంతో స్పాట్‌ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1814 డాలర్లు, ఔన్సు వెండి 20.05 డాలర్ల చొప్పున ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. వడ్డీ రేట్లు అంచనాలకు మించి పెరుగుతాయని సంకేతాలు ఇచ్చారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని సౌమిల్‌ గాంధీ తెలిపారు.