రూ. 7,374 కోట్ల రుణాన్ని ముందుగానే చెల్లించిన అదానీ గ్రూప్

రూ. 7,374 కోట్ల రుణాన్ని ముందుగానే చెల్లించిన అదానీ గ్రూప్

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ సంపద హరించుకుపోయింది. స్టాక్ మార్కెట్లో ఆయనకు చెందిన కంపెనీలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. అయినప్పటికీ తమ గ్రూప్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని తిరిగి సాధించడానికి గౌతమ్ అదానీ తన అప్పులు తీర్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అదానీ కంపెనీ మరో అప్పును ముందుగానే చెల్లించింది. తాజాగా తమ షేర్లు తనఖా పెట్టి తెచ్చిన రూ.7,374 కోట్ల రుణాలను ముందుగానే చెల్లించినట్టు ప్రకటించింది. వీటి చెల్లింపునకు 2025 ఏప్రిల్ వరకు గడవు ఉంది. అయినప్పటికీ ముందుగానే రుణాలు చెల్లించి కంపెనీల ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేసింది. అలాగే, రుణాల భారాన్ని తగ్గించుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రమోటర్లు చెల్లింపులు చేసినట్టు అదానీ గ్రూప్ వెల్లడించింది. కాగా, గత నెలలోనూ 1.11 బిలియన్ డాలర్ల విలువ చేసే రుణాలను గ్రూప్ ముందుగానే చెల్లించింది.