ఈడీ చార్జిషీట్​లో 28 సార్లు కవిత పేరు

ఈడీ చార్జిషీట్​లో 28 సార్లు కవిత పేరు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో తొలుత సమీర్ మహేంద్రు అరెస్ట్‌ అయ్యారు.  ఇక అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకూ 11 మంది అరెస్ట్ అయ్యారు. కాగా.. సమీర్ మహేంద్రు అరెస్ట్ సమయంలో ఈడీ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించింది. ఇప్పుడు అవి తెగ వైరల్ అవుతున్నాయి. లిక్కర్​ స్కాం ఈడీ చార్జ్ షీట్‌లో అరుణ్​ పిళ్లై  పాత్రపై కీలక సమాచారం ఉంది. కవిత తరపున అరుణ్​ పిళ్లై అన్నీ తానై చూసుకున్నారని ఈడీ పేర్కొంది. అరుణ్‌తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత పేర్కొనడం జరిగింది.  దక్షిణాది నుంచి వందకోట్లు ముడుపులు ముట్టజెప్పారని ఈడీ పేర్కొంది. సమీర్​మహేంద్రుపై దాఖలు చేసిన చార్జీషీట్‌లో ఈడీ కవిత పేరును 28 సార్లు ప్రస్తావించింది. సౌత్​ గ్రూప్​ ప్రతినిధులుగా అరుణ్​ పిళ్లై, అభిషేక్​, బుచ్చిబాబు ఉన్నారు. పిళ్లై సూచనలతో ఇండో స్పిరిట్స్​ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు కోటి రూపాయలు, ఇండియా ఎహెడ్​ సంస్థకు 70 లక్షల బదిలీ అయ్యాయి. ఇండో స్పిరిట్​ వ్యవహారాల్లో కవిత ప్రయోజనాలకు అరుణ్​ పిళ్లై ప్రాతినిధ్యం వహించారు. తమ తరుపున వాస్తవంగా పెట్టుబడి పెడుతున్నవారు కవిత, శరత్​ రెడ్డి, మాగుంట అని సమీర్​ మహేంద్రుకు అరుణ్​ పిళ్లై చెప్పారు. ఇండోస్పిరిట్‌లో కవిత ఆసక్తి చూపుతున్నారని, ఆమె తరపున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని సమీర్‌కు అరుణ్​ పిళ్లై వెల్లడించారు. 2021లో ఢిల్లీలోని తాజ్​ మాన్​ సింగ్​ హోటల్‌లో విందు జరిగింది. అరుణ్​ పిళ్లై ద్వారా, ఫేస్​ టైంలో సమీర్​ మహేంద్రు, కవిత మాట్లాడుకున్నారు. ఇండో స్పిరిట్​ ఎల్1 దరఖాస్తు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అరుణ్​ పిళ్లై ద్వారా కవితతో సమీర్​ మహేంద్రు మాట్లాడారు. అరుణ్ తన కుటుంబ సభ్యుడు లాంటి వారని, అరుణ్​తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత చెప్పారు.