దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంది

దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంది

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
ముద్ర, ముషీరాబాద్: దేశ, రాష్ట్ర ఉజ్వలమైన భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని మాజీ  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. యువత మనసు దీక్ష పట్టుదలతో ఉంటే దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్నారు. తమ భవిష్యత్తు కన్నా దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేవారు మహనీయులన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ 55వ వార్షికోత్సవాలు శుక్రవారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఏవి ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఆచార్య కే రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరవగా అతిథిగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువుగా భారతదేశం ఉండేదని బ్రిటిష్ వారు దండయాత్ర చేసి ధ్వంసం చేశారన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో ఆర్థిక శక్తిగా వేగంగా ముందుకు వెళుతుందన్నారు. నిజాం పాలనలో కొండా కుటుంబం మాడపాటి హనుమంతరావు తో కలిసి విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యాసంస్థలను ఇప్పటికీ ఒక స్ఫూర్తితో కొనసాగించడం గొప్ప విషయం అని చెప్పారు. స్వాతంత్రం వచ్చాక అభివృద్ధి సాధించిన ఇంకా 20 శాతం మంది దారిద్ర రేఖకు దిగవనే ఉన్నారని, సాంఘిక, కుల వివక్ష, మహిళల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు. వీటి రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఎవరికివారు బాధ్యతలు సక్రమంగా నిర్వహించినప్పుడే హక్కులు కాపాడబడతాయని తెలిపారు. విద్య వికాసాన్ని పెంచి పోషిస్తుందన్నారు.

యువకుల ప్రతిభకు అనుగుణంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్య అనేది విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతను పెంపొందించేలా ఉండాలన్నారు. గతంలో గురుకులాలలో గురువులు విద్యార్థులు కలిసి ఉండేవారని, విశాలంగా ఉండే పాఠశాలలు తగ్గిపోయాయని ప్రస్తుతం అపార్ట్మెంట్లో డిపార్ట్మెంటల్ స్టోర్ లా విద్యాలయాలను మార్చేశారన్నారు. క్యాస్ట్ కమ్యూనిటీ క్రిమినలిటీ క్యాష్ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. క్యారెక్టర్ కెపాసిటీ ఉన్నవారిని రాజకీయాల్లో ప్రోత్సహించాలని సూచించారు. మంచి విషయాలు చెప్పే వారికే పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పుడు మాటలు మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరి కాదన్నారు. బూతులు మాట్లాడే వారికి ప్రజలు పోలింగ్ బూతుల్లోకి వెళ్లి సరైన సమాధానం చెప్పాలని సూచించారు. వేసే ఓటు బుల్లెట్ కన్నా శక్తివంతమైనదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని మించింది మరొకటి లేదని దాన్ని పరిరక్షించుకోవాల్సన బాధ్యత ఉందన్నారు. మన వారసత్వ సంపదను కాపాడుకోవాలని, ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత కావాలన్నారు. నేచర్ కల్చర్ రెండూ కలిస్తే మనకు మేలు జరుగుతుందని చెప్పారు. ఏది కావాలన్నా గూగుల్ లో వెతుకుతున్నారని, అవసరమైన మేరకే ఫోన్ వాడాలని, గూగుల్ కన్నా గురువే మిన్న అన్నారు. సొంత ఆలోచనశక్తిని, సుజనాత్మకతను వదులుకోవద్దన్నారు.

మాతృ శక్తిని మాతృభాషను మాతృదేశాన్ని చదువు చెప్పిన గురువును సంస్థను ఎన్నటికీ మరువద్దన్నారు. ఇష్టపడిన పని కష్టపడి చేస్తే నష్టమేమీ ఉండదని చెప్పారు. దేశం కోసం ధర్మం కోసం దేనికైనా సిద్ధం కావాలని అన్నారు. మానసిక ప్రశాంతతతో జీవించాలని, శాంతియుత మార్గంలో పయనించాలని సూచించారు. మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ఇచ్చినమవుతోందని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. నవభారత నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవీ కళాశాల రెస్పాండెంట్ డాక్టర్ కె గౌతమి, కన్వీనర్ మంజులాదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ రాజలింగం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి పద్మ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.