సీఎం కప్‌ రాష్ట్రస్థాయి టోర్నీకీ ఘనంగా ఏర్పాట్లు

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి టోర్నీకీ ఘనంగా ఏర్పాట్లు
  •  క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దు
  • ఈ నెల 28 నుంచి 31 వరకు సీఎం కప్‌ రాష్ట్రస్థాయి టోర్నమెంట్స్‌
  • 29వ తేదీ సాయంత్రం ఘనంగా ఆరంభ వేడుక ఏర్పాట్లు
  • ఏర్పాట్లు సమీక్షించిన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ 
  • గౌడ్‌, ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా
ముద్ర ప్రతినిది, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాథమిక అధికార సంస్థ (సాట్స్‌) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ ` 2023 నిర్వహణలో ఇటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, రాష్ట్ర ఎక్సైజ్‌ క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం  సీఎం కప్‌ ` 2023 ఏర్పాట్లను పరిశీలించటానికి ఎల్‌బి స్టేడియానికి విచ్చేసిన క్రీడా శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాష్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాలతో మరియు సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కప్‌ పోటీలలో పాల్గొనడానికి విచ్చేస్తున్న క్రీడాకారులకు, క్రీడాకారిణిలకు భోజనం వసతి, టోర్నమెంట్‌ నిర్వహణ, సాంకేతిక విషయాల్లో మరియు ప్రారంభోత్సవ వేడుకల్లో ఎటువంటి లోటుపాటు రాకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

29వ తేదీ  జరిగే ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయాలని, ఇందులో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రతిబింబించేలా క్రీడాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని, ఆయన సూచించారు. అంతకుముందు ఎల్‌బి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాలు, స్టేడియం ఇన్చార్జిలు, వివిధ సబ్‌ కమిటీల ఇన్చార్జులు మరియు ఇతర సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ మాట్లాడుతూ, మండల స్థాయి, జిల్లా స్థాయిలో సీఎం కప్‌ క్రీడలకు అద్భుతమైన స్పందన లభించిందన్నారు. రెండు అంచెల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేసి రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారని అన్నారు.
ఒక ఇంటి పండుగ లాగా, సంతోషకరమైన వాతావరణంలో ఈ క్రీడలను జరుపుకోవాలని అధికారులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, క్రీడాకారిణిలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్రీడల్లో పాల్గొనే వారిని మరియు ఈ క్రీడలను సందర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలని అధికారులను కోరారు. ఈ టోర్నమెంట్‌ నిర్వహణ అందరిలో మధుర స్మృతులు మిగల్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ, క్రీడాకారులకు భోజనము వసతితో పాటు మెడికల్‌ సదుపాయాలు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని, అత్యవసర పరిస్థితులలో ప్రతి స్టేడియంలో ఒక డాక్టర్‌ అందుబాటులో ఉండేలా స్టేడియం పరిసరాలలో సానిటేషన్‌ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిహెచ్‌ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన మందులు, మెడికల్‌ కిట్స్‌ అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితిలో సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడానికి కూడా ముందస్తు ఏర్పాట్లతో ఉండాలని ఆయన సూచించారు. 

అన్ని సంబంధిత పనులు సమన్వయంతో, సమయస్ఫూర్తితో కట్టుదిట్టంగా చేపట్టి పండుగ వాతావరణంలో సీఎం కప్‌ క్రీడలు విజయవంతం చేయాలని ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాలు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఓఎస్‌డి డాక్టర్‌ లక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, ధనలక్ష్మి, అనురాధ, దీపక్‌ మనోహర్‌, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్‌డి డాక్టర్‌ హరి కృష్ణ, క్రీడా శాఖ అధికారులు, పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ జిహెచ్‌ఎంసి మరియు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ విభాగం అధికారులు పలువురు పాల్గొన్నారు.