బంగారానికి మళ్లీ డిమాండ్‌

బంగారానికి మళ్లీ డిమాండ్‌

దిల్లీ: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇటీవలే తగ్గినట్లు తగ్గిన పసిడి ధర మళ్లీ పైకెగసింది. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మళ్లించడంతో అంతర్జాతీయంగా దీనికి డిమాండ్‌ ఏర్పడింది.  ఫలితంగా ధరలు పెరిగాయి. దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది. దేశ రాజధాని దిల్లీలో స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఒక్కరోజే ఏకంగా రూ.970 పెరిగి రూ.56,550కి చేరింది. వెండి కిలో సైతం రూ.1600 మేర పెరిగి రూ.63,820కి పెరిగింది.

అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు ధర 1875 డాలర్లు వద్ద ట్రేడవుతుండగా.. వెండి 20.75 డాలర్ల వద్ద కొనసాగుతోంది.  అంతర్జాతీయంగా ధరలు పెరగడమే బంగారం ధరల పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ వెల్లడించారు. అమెరికా డాలర్‌ విలువ పతనం అవ్వడం, ద్రవ్యోల్బణం కట్టడికి ఓ వైపు ఫెడ్‌ రేట్ల పెంపు చేపడుతున్నా యూఎస్‌ ఎకమిక్‌ డేటా పాజిటివ్‌గా రావడం, అమెరికాలో రెండు బ్యాంకులు దివాలా తీయడం వంటి పరిణామాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడులు మరలించడం వల్ల బంగారానికి ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడిందని, దీంతో ఐదు వారాల గరిష్ఠానికి బంగారం ధర చేరిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవనీత్‌ దమానీ వెల్లడించారు.