ఎట్టకేలకు లాభాలొచ్చాయ్‌

ఎట్టకేలకు లాభాలొచ్చాయ్‌

ముంబయి: ఎనిమిది రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఎట్టకేలకు బ్రేక్‌ తీసుకున్నాయి. ఉదయమే సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. టీసీఎస్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి దిగ్గజ షేర్లు సూచీల లాభాలకు దోహదం చేశాయి. బ్యాంకింగ్‌, లోహ రంగాల షేర్లలో వచ్చిన కొనుగోళ్ల మద్దతు కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.

మరోవైపు వరుస ఎనిమిది రోజుల నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద ముదపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు కూడా జతయ్యాయి. చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ఆసియా మార్కెట్లలోని సానుకూలతలు నింపింది. ఇదే కారణంతో నేడు ఐరోపా మార్కెట్ల సైతం లాభాలతో ప్రారంభమయ్యాయి.