బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న రాహుల్‌ గాంధీ 

బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న రాహుల్‌ గాంధీ 

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఇంగ్లాండ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. 10 రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్‌  వెళ్లిన ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.   ఈ పర్యటనలో ఆయన బ్రిటన్‌ పార్లమెంట్‌ లో ప్రసంగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మార్చి 6వ తేదీన వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌లోని గ్రాండ్‌ కమిటీ రూమ్‌లో యూకే  ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. దీనిపై భారత సంతతికి చెందిన యూకే ఎంపీ వీరేంద్ర శర్మ స్పందిస్తూ.. ''కేవలం రాజకీయాలపై మాత్రమే గాక, ఇరు దేశాల మధ్య ఉన్న సంస్కృతి, సామాజిక, వ్యాపార బంధంపై రాహుల్ ప్రసంగం ఉండనుంది'' అని తెలిపారు.


ప్రఖ్యాత కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ విద్యార్థులనుద్దేశిస్తూ రాహుల్‌ ప్రసంగించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన లండన్‌ లోని ప్రవాస భారతీయులతో ఇష్టాగోష్ఠీలో పాల్గొననున్నారు. దీంతో పాటు ఇండియన్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. లండన్‌లోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.