మహిళా భాగస్వామ్యం మరింతగా పెరగాలి

మహిళా భాగస్వామ్యం మరింతగా పెరగాలి

సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలలో లింగ వివక్షను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి జనరల్ ఆంటోనియో గుటెర్రెస్  పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్కరూ మహిళల సహకారంతో ఎంతో ప్రయోజనం పొందుతారని అన్నారు. సృజనాత్మకత, సైన్స్, టెక్నాలజీ రంగాలలో వారి భాగస్వామ్యం మరింతగా పెరగాలన్నారు. మహిళల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి కమిషన్ 67 వ సెషన్ ప్రారంభోత్సవం సందర్భంగా గుటెర్రెస్ ప్రసంగించారు.  ప్రపంచంలో సాంకేతికత ఎంత ముందుకు సాగుతున్నా మహిళలు, బాలికలు వెనుకబడి ఉన్నారని అన్నారు. మూడు బిలియన్ల మంది ఇప్పటికీ ఇంటర్నెట్‌తో కనెక్ట్ కాలేదని, వారిలో అధికశాతం అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మహిళలు, బాలికలే అన్నారు. టెక్ పరిశ్రమలో పురుషుల సంఖ్య.. మహిళల సంఖ్య కన్నా రెండు రెట్లు అధికంగా ఉన్నదన్నారు.  కృత్రిమ మేధస్సు రంగంలో ఐదుగురు సిబ్బందిలో ఒకరు మాత్రమే మహిళ అని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్, టెక్నాలజీ రంగంలో లింగ వ్యత్యాసం కొనసాగుతున్నదన్నారు. ఇప్పటికీ పితృస్వామ్య వ్యవస్థ, మహిళా వివక్ష, అసంబద్ధ సంప్రదాయవాదాలు నాటుకుపోయి ఉన్నాయన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలలో మహిళల పూర్తి సహకారాన్ని ప్రోత్సహించడం ఎక్కడా కనిపించడం లేదన్నారు. మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు  ప్రపంచ సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడు మంచి పరిష్కారాలు అందుతాయన్నారు.