మ‌స్క్‌కు హై సెక్యూరిటీ

మ‌స్క్‌కు హై సెక్యూరిటీ

న్యూఢిల్లీ : ప్రపంచంలో  రెండ‌వ అత్యంత సంప‌న్నుడు, ట్విట్టర్​  బాస్ ఎల‌న్ మ‌స్క్‌కు  భద్రత  క‌ట్టుదిట్టం చేశారు. ట్విట్టర్​ ప్రధాన  కార్యాల‌యంలో మ‌స్క్‌ను భద్రతా సిబ్బంది నీడ‌లా వెన్నంటి ఉంటోంది. మ‌స్క్ రెస్ట్ రూంలో ఉన్నా ఇద్దరు బాడీగార్డులు ఆయ‌న‌ను అనుస‌రిస్తారు. బాడీగార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, సాయుధ ఎస్కార్ట్‌లతో కూడిన  భద్రతా సిబ్బంది మ‌స్క్‌ను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. మ‌స్క్ ట్విట్టర్​ కార్యాల‌యంలో ఉన్న స‌మ‌యంలో బ‌లిష్టంగా, పొడవుగా హాలీవుడ్ సినిమాల త‌ర‌హాలో క‌నిపించే ఇద్దరు  బాడీగార్డులు ఆయ‌న వెన్నంటి ఉంటార‌ని మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పనిచేసే ఓ టెకీ పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల‌పై విశ్వాసం లేనందునే ఎలాంటి రిస్క్ తీసుకోరాద‌ని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్​  ప్రధాన  కార్యాల‌యంలోనూ మ‌స్క్ పూర్తిస్ధాయి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నార‌ని చెబుతున్నారు.  ప్రముఖులకు  ప‌టిష్టమైన  భద్రత  ఉండ‌టం, వారు ఎక్కడికి  వెళ్లినా బాడీగార్డులు అనుస‌రించ‌డం నూత‌న ఒర‌వ‌డి కాకున్నా ఇటీవ‌ల ఓ వ్యక్తి  మ‌స్క్‌ను అనుస‌రించిన ఘ‌ట‌న నేప‌ధ్యంలో బిలియ‌నీర్‌కు భద్రత  క‌ట్టుదిట్టం చేశారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో మ‌స్క్ త‌న రెండేండ్ల కుమారుడితో క‌లిసి రాత్రి వేళ బ‌య‌ట‌కు వెళ్లగా  ఓ వ్యక్తి అనుస‌రించాడు. మ‌స్క్‌ను వెంబ‌డించిన వ్యక్తి  కారును ముందుకెళ్లకుండా అడ్డుకోవ‌డంతో పాటు బానెట్ పైకి ఎక్కి హంగామా చేశాడు. ఈ వ్యక్తిని  లేదా కారును ఎవ‌రైనా గుర్తించ‌గ‌ల‌రా అంటూ వీడియోను ట్వట్టర్​లో  మ‌స్క్ షేర్ చేశారు. ఈ ఘ‌ట‌న‌తో మ‌స్క్ తన భద్రతపై  ఆందోళ‌న వ్యక్తం  చేశారు.