ట్రంప్​ను చంపడానికి ఎదురుచూస్తున్నాం

ట్రంప్​ను చంపడానికి ఎదురుచూస్తున్నాం
We are Waiting to kill Trump

అగ్రరాజ్యం అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాక్ ఆయుధ సంపత్తిని పెంచుకుంటోందా? ఇరాన్ ఇటీవల 1,650 కిలోమీటర్ల (1,025) మైళ్ళ దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించే క్రూయిజ్ మిజైల్ ను అభివృద్ధి చేయడం వెనుక కారణం ఇదేనా? ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ అమిరాలి అజీజాదే  తాజాగా ఇదే తరహాలో హెచ్చరిక సందేశాలిచ్చారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేందుకు ఎదురుచూస్తున్నామని చెప్పారు. ''ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంబుల పొదిలోకి 1,650 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే క్రూయిజ్ క్షిపణి వచ్చి చేరింది'' అని ఇరాన్ టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అమిరాలి తెలిపారు.

క్రూయిజ్ మిజైల్ తొలి ఫుటేజ్‌ను ఇరానియన్ టీవీ ప్రసారం కూడా చేసింది. 2020లో బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో తమ (ఇరాన్) మిలటరీ కమాండర్ సులేమాని మరణించాడని, ఇందుకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా దళాలపై తమ బలగాలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయని చెప్పారు. అయితే అమాయక ప్రజలను చంపాలనేది మాత్రం తమ ఉద్దేశం కాదని అమిరాలి తెలిపారు. ట్రంప్‌ను అంతమొందించేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. సులేమాని హత్యకు ఆదేశాలు జారీ చేసిన అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మేక్ పాంపియే, నాటి మిలటరీ కమాండర్లను కూడా చంపుతామని హెచ్చరించారు.