నరేంద్ర మోదీతో బిల్ గేట్స్ భేటీ 

నరేంద్ర మోదీతో బిల్ గేట్స్ భేటీ 

న్యూఢిల్లీ: భారత దేశ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యంతోపాటు వివిధ రంగాల్లో భారత్ సాధించిన పురోగతికి బిల్,మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో ఛైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు.  ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం జరిగిన భేటీ తన పర్యటనలో హైలైట్ అని బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాశారు.''ప్రపంచం సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం వంటి డైనమిక్ దేశాన్ని సందర్శించడం స్ఫూర్తిదాయకం'' అంటూ బిల్ గేట్స్ పేర్కొన్నారు.  కొవిడ్-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంపై ప్రధాని మోదీతో తాను టచ్‌లో ఉన్నానని బిల్ గేట్స్ చెప్పారు.  కరోనా మహమ్మారి కారణంగా తాను గత మూడేళ్లుగా పెద్దగా ప్రయాణాలు చేయనప్పటికీ, ప్రధాని మోదీతో తాను ప్రత్యేకంగా కొవిడ్ -19 వ్యాక్సిన్‌ అభివృద్ధి గురించి మాట్లాడానని బిల్ గేట్స్ గుర్తు చేసుకున్నారు. 2.2 బిలియన్ల కంటే ఎక్కువ కొవిడ్ వ్యాక్సిన్‌లను పంపిణీ చేసిన కో-విన్ ప్రపంచానికి ఒక నమూనా'' అని అని బిల్ గేట్స్ పేర్కొన్నారు.మహమ్మారి సమయంలో భారతదేశం 200 మిలియన్ల మంది మహిళలతో సహా 300 మిలియన్ల మందికి అత్యవసర డిజిటల్ చెల్లింపులను చేసిందని గేట్స్ పేర్కొన్నారు.గతి శక్తి కార్యక్రమాన్ని గేట్స్ ప్రశంసించారు. ప్రభుత్వాలు మెరుగ్గా పనిచేయడానికి డిజిటల్ టెక్నాలజీ ఎలా సహాయపడుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని బిల్ గేట్స్ అన్నారు.