ఢిల్లీని వదలని ‘యమున’

ఢిల్లీని వదలని ‘యమున’
  • ఎర్రకోట చుట్టూ వరద నీరు
  • లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
  • పలు ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు 
  • జనజీవనం పూర్తిగా అస్తవ్యస్థం
  • ఉత్తరాదిలో భారీ ప్రాణ, ఆస్థి నష్టం
  • ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య145

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఇంకా వరదలు భయపెడుతూనే ఉన్నాయి. యమునా నది వరద ఉధృతి ఏ మాత్రం తగ్గకపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శుక్రవారం కూడా వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హతీకుండ్​ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఉదయం నీటి విడుదలను తగ్గించారు. అయినా యమున ఉధృతి తగ్గకపోవడంతో నీటి విడుదలను పూర్తిగానే నిలిపివేశారు. దీంతో శనివారం మధ్యాహ్నం వరకూ పరిస్థితులలో మార్పు వచ్చి యమునా తీరంలో వరదనీరు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ పరిస్థితులను సమీక్షించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీవాసులకు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. యమున ఉధృతి తగ్గితే సహాయక చర్యలలో వేగం పెంచుతామన్నారు. పై నుంచి వచ్చే ప్రాజెక్టు నీటితో కూడా ఢిల్లీలో తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఢిల్లీ నగరంలోని లోహాపూల్ ప్రాంతంలో రహదారిపైకి భారీగా వరదనీరు చేరింది. దీంతో భారీ ట్రక్కులు సగం వరకు మునిగిపోయాయి. ఎర్రకోట చుట్టూ, కశ్మీరీ గేట్ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. పోలీసులకు చెందిన వ్యాన్ ఒకటి సగం వరకు నీటితో నిండి చిక్కుకుపోయింది. ఢిల్లీ మెట్‌కాఫ్ రోడ్‌లో ఉన్న సుశ్రుత ట్రామా సెంటర్‌లోకి వరద పోటెత్తింది. చాంద్గీరామ్ అఖాడా చౌక్ ప్రాంతంలో వాహనాలు, ట్రక్కులు మునిగిపోయాయి. పురానా ఖిలా ప్రాంతంలో వాహనాలు చిక్కుకుపోయారు. ట్రాఫిక్ మళ్లించడంతో సారాయ్ కలేఖాన్ ప్రాంతంలో కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతంపై వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. 

కుండపోత వానలు
ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. భారీ వర్షాలు, వరద సంబంధిత ఘటనలలో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 145 మందికి పైగా మరణించారు. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లో 14 మంది, హర్యానాలో 16, పంజాబ్ లో 11, ఉత్తరాఖండ్ లో 16 మంది మృతి చెందారు. హిమాచల్​ప్రదేశ్​లో 636 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 1,128 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 1,110 రోడ్లు బ్లాక్ అయ్యాయని ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. వర్షాలు, వరదల కారణంగా దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఉత్తరాది రాష్ర్టాలను జూలై వర్షాలు తీరని కష్ట నష్టాలను కలిగించాయి.