ఓటరు జాబితా పక్కాగా ఉండాలి

ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
  • పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
  • అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్

ముద్ర, తెలంగాణ బ్యూరో: జిల్లాలలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే జరగనున్న శాసనసభ సాధారణ ఎన్నికలపై అవగాహన, ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల ఉపయోగం కోసం డిజిటల్ ఔట్రీచ్ పై జిల్లాల ఎన్నికల అధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండో విడత ఓటరు జాబితా సవరణలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలకు ముందు, ఇప్పటికే వచ్చిన ప్రతి దరఖాస్తును స్క్రూటినీ చేయాలని సూచించారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి నిర్ధారించుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల అదనపు కమిషనర్​లోకేష్ కుమార్ మాట్లాడుతూ ఓటరు జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓటర్ల వివరాలు తొలగించిన నేపథ్యంలో అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఫొటో సిమిలర్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ తొలగించాలన్నారు. ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ ద్వారా ఫారం 6, ఫారం 7, ఫారం 8 క్రింద వచ్చిన దరఖాస్తులను ఈ నెల 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశాల మేరకు జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కేంద్రాల వద్ద ర్యాంపులు,  లైటింగ్, త్రాగునీరు, ఫర్నిచర్,  పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా టాయిలెట్లు సమకూర్చుకోవాలన్నారు.  ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంటే  నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రణాళికా ప్రకారంగా జరగాలి
అసెంబ్లీ నియోజకవర్గంవారీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని లోకేష్ కుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది, అందుబాటులో ఉన్న సిబ్బంది, వారికి శిక్షణ తదితర అంశాలతో సంపూర్ణ సమాచారంతో ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగం పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన  జూలై 28 నుంచి స్విప్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని, స్విప్ కార్యక్రమాల నిర్వహణపై రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని అన్నారు. ఎఫ్.ఎల్. సీ పూర్తయిందని,  సరిగ్గా పని చేస్తున్న,  ఈవీఎం,  వీవీప్యాట్ యంత్రాల వివరాలు రాజకీయ పార్టీలకు ఇవ్వాలని,  ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు ఉండే స్ట్రాంగ్ రూంకు మంచి భద్రత కల్పించాలని,  అగ్నిప్రమాదాల నియంత్రణ కోసం ఫైర్ అలారంలు ఏర్పాటు చేయాలని అన్నారు.  ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు.