ప్రియాంకా గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ప్రియాంకా గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీపై దురుద్దేశపూర్వకంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రాపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాజస్థాన్ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ లోని దౌసా నియోజకవర్గం పరిధిలోని సికరాయ్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ప్రియాంకా చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేవిగా ఉన్నాయని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రతిపక్షనాయకుడు, బీజేపీ నేత రాజేంద్ర సింగ్ రాథోర్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సభలో మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న ప్రియాంకా గాంధీపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషన్ ను కోరారు. గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

భారతీయ జనతా పార్టీ తన స్వీయ ప్రయోజనాల కోసమే అధికారంలో వుండాలని కోరుకొంటోందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. “ఎన్నికలు వచ్చినప్పుడల్లా వారు (అంటే బీజేపీ నాయకులు) మతం, కులం గురించి మాట్లాడతారు. మతం పరిరక్షణ దాని అభ్యున్నతికి సంబంధించిన అంశాలను ఏ భారతీయుడు తిరస్కరించలేడు. మానసికంగా అందరికీ అనుబంధమైన అంశం ఇది. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే, ఎన్నికల సమయంలో మాత్రమే దాని గురించి మాట్లాడుతూ, అభివృద్ధి విషయమై వారు ఎందుకు పట్టించుకోరు” అంటూ ప్రియాంకా గాంధీ సికరాయ్ బహిరంగ సభలో విమర్శించారు. రాజస్థాన్ లోని 200 అసెంబ్లీ స్థానాలకు గాను నవంబరు 25న ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న విషయం విదితమే. అధికారంలో వున్న పార్టీపై వ్యతిరేక ఓటు ప్రాధాన్యం సంతరించుకోనున్న ఈ ఎన్నికలలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే జరుగుతోంది. మిగిలిన రాష్ట్రాలతో పాటే డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.