ఎంపీ బీజేపీలో టిక్కెట్ల పోరు

ఎంపీ బీజేపీలో టిక్కెట్ల పోరు
  • కేంద్రమంత్రి ఎదుటే కొట్టుకున్న నేతలు
  • సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో ముగ్గురి అరెస్టు

జబల్ పూర్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ టిక్కెట్ల విషయమై భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 92 మంది అభ్యర్థుల పేర్లతో అయిదో జాబితా విడుదల చేసిన సందర్భంగా జబల్ పూర్ లో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీ ఇన్ చార్జి భూపేందర్ యాదవ్ సమక్షంలోనే పార్టీ నాయకులు ఘర్షణకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగి విధుల నిర్వహణను అడ్డుకున్నారని కేంద్ర మంత్రి సెక్యూరిటీ గార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గొడవలో ప్రమేయం వున్న మరికొంతమందిని కూడా గుర్తించామని పోలీసు ఎస్పీ ఏపీ సింగ్ వెల్లడించారు. కేంద్రమంత్రిని చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు ఒకరిని ఒకరు బూతులు తిట్టుకుంటూ, కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్కడి పరిస్థితిని చక్కబరిచేందుకు తన దగ్గర వున్న రివాల్వర్ ను తీయడానికి ప్రయత్నిస్తున్న ఒక సెక్యూరిటీ గార్డును కూడా నిరసనకారులు కొట్టినట్టుగా ఆ వీడియోలో ఉంది. కేంద్రమంత్రి యాదవ్, రాజ్యసభ సభ్యురాలు కవితా పటీదార్ ల సమక్షంలో నాయకులు వాగ్యుద్ధానికి దిగారు. మద్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకు గాను ఇప్పటికే బీజేపీ 228 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుణ, విదిష అసెంబ్లీలకు మాత్రమే ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. 

జబల్ పూర్ ఉత్తర అసెంబ్లీ నుంచి అభిలాష్ పాండేకు టిక్కెట్ కేటాయించడంపై స్థానిక పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. బయట నుంచి వచ్చి పార్టీలో కొత్తగా చేరిన పాండేకు టిక్కెట్ ఎలా ఇస్తారని పలువురు పార్టీ నేతలు యాదవ్ తదితరులను నిలదీశారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాలలో కూడా టిక్కెట్ల వివాదం చెలరేగింది. మాజీఎమ్మెల్యే మున్నాలాల్ గోయల్ మద్దతుదారులు గ్వాలియర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బరదారి ప్రాంతంలో రహదారిని దిగ్బంధించారు. దివంగత ప్రధాని వాజపేయి కుటుంబ సన్నిహితుడు, మాజీమంత్రి, ఎమ్మెల్యే అనూప్ మిశ్రాకు పార్టీ టిక్కెట్ దక్కలేదు. పార్టీ శ్రేణుల ఆగ్రహం విజయావకాశాలను దహించివేస్తుందని ఆయన అన్నారు. కార్యకర్తలు బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తేనే పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని చెబుతూనే, తాను ఒక సిపాయిలా పనిచేస్తూ పార్టీ ఆదేశాలను పాటిస్తానని పేర్కొనడం విశేషం.

బీజేపీలో టిక్కెట్ల పోరు కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా ఇన్ ఛార్జి కె.కె.మిశ్రా మాట్లాడుతూ, కాంగ్రెస్ టిక్కెట్ల పంపిణీని లక్ష్యంగా చేరుకుని విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిని ఏమంటారని ప్రశ్నించారు. ఇదిలావుంటే ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరి దేవాస్ జిల్లా ఖటేగావ్ టిక్కెట్ దక్కించుకున్న దీపక్ జోషి కారును కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ లో జోషి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గీయులు ఆయన కారు అద్దాలను కూడా పగులగొట్టారు.