అమెరికాలో ఘనంగా జరుపుకున్న బతుకమ్మ పండుగ

అమెరికాలో ఘనంగా జరుపుకున్న బతుకమ్మ పండుగ

నార్త్ కరోలినా :అమెరికా దేశంలో  లో తెలుగు వాళ్ళు ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు.తెలుగు వాళ్ళు అధికంగా నివసించే న్యూయార్క్, న్యూ జెర్సీ ,టెక్సాస్ ,చికాగో, నార్త్ కరోలినా, కాలిఫోర్నియా, వర్జినియా, ఓహాయో, జార్జియా ఫ్లోరిడా, మొదలగు రాష్ట్రాలలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇటీవల కాలంలో భారతీయ సంస్కృతి తో పాటు తెలంగాణ సాంస్కృతిని  ప్రపంచం నలుమూలల ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకుంటున్నారు. తమ సంస్కృతి సాంప్రదాయాలు మరవకుకూడదని పిల్లలకు వారసత్వంగా అందించాలని ఉద్దేశంతోనే ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రచ్యాత్య దేశాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలుగువారు తమ సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు.

పండగ సమయంలో తాము తమ గ్రామంలో లేమనే బెంగ ఇక్కడ జరిగిన ఈ ఉత్సవాలలో పాల్గొనడం వల్ల తీరిందని తమ పిల్లల వద్దకు వచ్చిన వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వెలిబుచ్చారు. నార్త్ కరోలినా రాష్ట్రంలోని మొర్సివిల్లి కమ్యూనిటీ పార్కులో  తెలుగు వారంతా ముఖ్యంగా తెలంగాణ వారు వందలాదిగా మహిళలు ఒకచోట చేరి బతుకమ్మ ఆడడం మరువలేని సంఘటనగా ఉందని కొంతమంది అభిప్రాయాన్ని తెలియజేశారు. సద్దుల బతుకమ్మ ఆదివారం రావడంతో మహిళలు పురుషులు పిల్లలు అందరూ సంతోషంగా తమ తమ ప్రాంతాల్లోని కమ్యూనిటీలలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు.పోటీపడి నిలువెత్తు బతుకమ్మలను పేర్చి తమ పండుగ ప్రాముఖ్యతను తెలిపారు.  ఖరీదైన బంగారు నగలు, రంగురంగుల పట్టు చీరలు ధరించి, కోలాటాలతో లయబద్ధంగా ఆటలాడుతూ, ప్రకృతి పూలతో ఆరోగ్యకరమైన ఒక గొప్ప పండుగ ఉంటుందని తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలల కీర్తించే విధంగా చాటినందుకు తెలంగాణ పౌరులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు.