రేపట్నుంచి జీ 20 సమావేశాలు

రేపట్నుంచి జీ 20 సమావేశాలు
  • సుందరంగా ముస్తాబైన ఢిల్లీ నగరం
  • సదస్సులో పాల్గొననున్న 30 దేశాల అధినేతలు
  • నేడు జో బైడెన్ తో పీఎం మోడీ డిన్నర్ భేటీ
  • మొత్తం 15 దేశాల అధినేతలతో పీఎం మోడీ ద్వైపాక్షిక చర్చలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మన దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ 20 సమావేశాలను నిర్వహిస్తుంది. ఈనెల 9,10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని నగరాన్ని సుందరమయంగా తీర్చిదిద్దారు. జీ20 సభ్య దేశాలతో పాటు మొత్తం 30 దేశాధినేతలు, పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు మంచి తరుణంగా మన దేశం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాల అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ప్రధానంగా అందరి దృష్టి ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీపైనే ఉంది. ఇప్పటికే అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరిన జో బైడెన్ ఈరోజు సాయంత్రం ప్రధాని మోడీ ఇచ్చే ప్రైవేట్ డిన్నర్ కు హాజరుకానున్నారు. మోడీ, బైడెన్ ద్వైపాక్షిక సమావేశం అనంతరం డిన్నర్ ఉంటుంది. ఈ భేటీలో ప్రధానంగా జెట్ ఇంజన్ల తయారీ, న్యూక్లియర్ టెక్నాలజీ వంటి అంశాలే ప్రధాన ఎజెండా ఉన్నట్లు తెలుస్తోంది. 

15 దేశాల అధినేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు

జీ 20 సమావేశాల సందర్భంగా 15 దేశాల అధినేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే ఉద్దేశ్యంతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు (శుక్రవారం) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ, మారిషస్, బంగ్లాదేశ్ అధినేతలతోనూ, ఈనెల 9న యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాల అధినేతలతోనూ దైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 10న ప్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో ప్రధాని మోడీ లంచ్ మీటింగ్ ఉంటుంది. అలాగే కొమొరోస్, టర్కీ, యుఏఇ, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా దేశాల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం ఉన్నట్లు తెలుస్తోంది.