పత్రికల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు

పత్రికల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు

చండీగఢ్: మీడియా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా ప్రింట్ మీడియా ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్   సుఖ్కు అన్నారు. ఉన్నతమైన పాత్రికేయ విలువలతో నిష్పక్షపాతంగా వార్తలు, కథనాలు రాస్తే ఆ పత్రికలకు, వాటిలో పనిచేసే జర్నలిస్టులకు విలువ, గుర్తింపు ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఈరోజు చండీగఢ్ లో జరిగిన వార్తా పత్రికలు, వార్తా సంస్థల ఉద్యోగ సంఘాల సమాఖ్య సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.  సంచలనాల కోసం ప్రాధాన్యత లేని స్వల్ప విషయాలపై  రాయకుండా సామాజిక ఆర్థిక ప్రాధాన్యత గల అంశాలపై దృష్టి సారించాలని పంజాబ్ ముఖ్యమంత్రి సూచించారు. తమ రాష్ట్రంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కూడా తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ట్రిబ్యూన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆతిథ్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల మీడియా మీట్ లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి  సుఖ్విందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగవ మూల స్తంభమైన మీడియా నిష్పక్షపాతంగా,  స్వతంత్రంగా పనిచేయాలంటే జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విలువలకు కట్టుబడి పనిచేస్తున్నందువల్లనే ట్రిబ్యూన్ పత్రిక వందేళ్లుగా ప్రజాదరణతో ముందుకు సాగుతోందని ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము, పంజాబ్, చండీగఢ్ జర్నలిస్ట్స్ యూనియన్  అధ్యక్షుడు బల్బీర్ సింగ్ జండూ,  ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యురాలు బిందూ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఐజేయూ నాయకులను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సత్కరించారు.

హర్యానా గవర్నర్ తో భేటీ

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము, పంజాబ్ చండీగఢ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ జండూ తదితరులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలుసుకున్నారు. హర్యానా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి ఆదేశించాలని వారు కోరారు.