ఎన్సీపీకి అజిత్​పవార్​షాక్​

ఎన్సీపీకి అజిత్​పవార్​షాక్​
  • మహారాష్ట్ర అధికారపక్షంలో చేరిన ఎన్సీపీ విపక్ష నేత
  • వెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం
  • 9 మంది అజిత్​అనుచరులకు మినిస్టర్​పదవులు
  • ప్రధాని చర్యలు ప్రజలు గమనిస్తున్నారు : శరద్​పవార్​

మహారాష్ట్ర : మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న నేషనలిస్ట్​కాంగ్రెస్​పార్టీ (ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ ఆ పార్టీకి భారీ ఝలక్​ఇచ్చారు. ఆదివారం బీజేపీలో చేరిన ఆయన.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్​తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్ నాథ్ షిండే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అనంతరం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ పదవిని అధిష్ఠించగా.. మరో 9 మంది ఆయన అనుచరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 30 మంది అజిత్ పవార్ వెనకాల ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏక్ నాథ్ షిండేనుతో అజిత్​భేటీ..

డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు అజిత్​పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను కలిశారు. అనంతరం అంతా కలిసి రాజ్‌భవన్ వెళ్లి అక్కడ గవర్నర్ రమేశ్ బైస్‌ను కలిశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, మిగతా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్సీపీ ఎమ్మెల్యేలతో భేటీ..

అంతకుముందు అజిత్‌ పవార్‌ తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో విడిగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. అయితే ఇటీవల అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించడం.. ఆ తర్వాత మద్దతుదారుల ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తెలిసిందే. అయితే ఆ తర్వాత పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను శరద్ పవార్ నియమించారు. అందులో ఒకరు శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే కాగా.. మరొకరు పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్. అయితే కీలక పదవుల నుంచి తనను పక్కకు పెట్టారని అజిత్ పవార్‌ తీవ్ర నిరాశతో ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు. సరైన సమయం చూసి ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.

అజిత్​వెళ్లినంతమాత్రాన పార్టీ బలహీనపడదు : శరద్ పవార్

అయితే ఎన్సీపీలో, మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారినా ఎన్సీపీ అధినేత శరద్ పవార్​కు తెలియకపోవడంపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది. అజిత్ పవార్ ఎన్సీపీ నేతలతో సమావేశమైనట్లు తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యేలను అజిత్ పవార్ ఎందుకు పిలిచారో తనకు తెలియదు కానీ.. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నందున.. వారిని భేటీకి పిలిచే హక్కు అజిత్ పవార్‌కు ఉంటుందని పేర్కొన్నారు. అజిత్​పవార్ వెళ్లినంత మాత్రాన పార్టీ బలహీన పడదన్నారు. పార్టీలో నూతన జవసత్వాలతో మరింత పట్టుదలతో ముందుకువెళతామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీలో మార్పు చేర్పులు చేసి ముందుకు వెళతామని శరద్​పవార్  అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీ ఇతర పార్టీ నేతలను మభ్యపెడుతూ ఆయా నేతలను తమ పార్టీలోకి లాక్కోవడం మంచిది కాదన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, 2024లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  •  ట్రిపుల్​ఇంజన్​ స్పీడ్​తో దూసుకెళ్తాం : 
  • మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​షిండే

మహారాష్ట్ర : ఇకనుంచి ట్రిపుల్​ఇంజిన్​స్పీడ్​తో అభివృద్ధిలో దూసుకెళ్తామని మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​షిండే తెలిపారు. ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీ-శివసేన కూటమిలో అజిత్ పవార్ చేరడం, వెంటనే ప్రభుత్వంలో రెండో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ఏక్‌నాథ్ షిండే స్పందించారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని, ఇంతవరకూ డబుల్ ఇంజన్‌గా ఉన్న తమ ప్రభుత్వం ట్రిపుల్ ఇంజన్‌‌ ప్రభుత్వమైందన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం అజిత్ పవార్‌ను, ఆయన తరఫు నేతలను సాదరంగా ఆహ్వానిస్తు్న్నానని షిండే చెప్పారు. మహారాష్ట్రలో అధికార కూటమి మరింత బలపడడానికి అజిత్ పవార్ అనుభవం ఎంతో ఉపకరిస్తుందన్నారు. క్యాబినెట్‌లో సీట్ల షేరింగ్‌పై మీడియా ప్రశ్నించగా, దీనిపై చర్చించేందుకు చాలా సమయం ఉందని ఏక్‌నాథ్ షిండే సమాధానమిచ్చారు. తామంతా కలిసికట్టుగా మహారాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. లోక్‌సభలో విపక్షాలకు 4 నుంచి 5 సీట్లు ఉన్నాయని, ఈసారి ఆ సీట్లు కూడా వారికి రావడం కష్టమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. 

ముప్పై, నలభై మంది ఎమ్మెల్యేల మద్దతుతో తాను ప్రమాణం చేసినట్టు అజిత్ పవార్ చెబుతుండగా, అనేక ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిణామం శివసేన తరహాలోనే ఎన్‌సీపీలో చీలినట్టుగా భావించాల్సి ఉంటుందా? అజిత్‌పై ఎన్‌సీపీ అనర్హత వేటు వేస్తుందా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలపై శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందించారు. తాను చాలా బలంగా ఉన్నానని శరద్ పవార్‌ చెప్పారని, ప్రజల మద్దతుతో ఉద్ధవ్ థాక్రేతో కలిసి తిరిగి పార్టీ పునర్నిర్మాణం జరుపుతానని పవార్ అన్నారని రౌత్​పేర్కొన్నారు.