కేసీఆర్​ను ఈజీగా ఓడిస్తాం

కేసీఆర్​ను ఈజీగా ఓడిస్తాం
  • రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాం
  • బీజేపీ బంధువుల సమితిగా బీఆర్ఎస్​
  • ఆ పార్టీ బీజేపీకి బీ టీంగా మారింది
  • కేసీఆర్..​మోడీ చేతిలో ఓ రిమోట్ కంట్రోల్
  • అందుకే రైతు వ్యతిరేక బిల్లుకు మద్దతు ఇచ్చారు
  • తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్యే పోటీ
  • అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్​
  • ఖమ్మం జనగర్జన సభలో కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ
  • కండువా కప్పి పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్
  • శాలువా కప్పి భట్టి విక్రమార్కకు సన్మానం


బీఆర్ఎస్​అంటే బీజేపీ బంధువుల సమితి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ బీ టీం అయిన బీఆర్ఎస్​కు మధ్యే పోటీ ఉంటుంది. ప్రధాని మోడీ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్​సమర్థిస్తున్నారు. ప్రధాని చేతిలో కేసీఆర్ రిమోట్​లా మారారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ విమర్శించారు. వరంగల్​లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్​లో యూత్​డిక్లరేషన్​ప్రకటించామని, ఖమ్మం వేదికగా కాంగ్రెస్​చేయూత పేరుతో వృద్ధులు, వితంతువులకు ప్రతీనెల రూ.4వేల పింఛన్​ఇస్తామని తెలిపారు. అంతకుముందు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కండువా కప్పి కాంగ్రెస్​పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్​మార్చ్ పాదయాత్ర​ముగింపు సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.

కాళేశ్వరంలో లక్షకోట్ల అవినీతి..

తెలంగాణలో సీఎం కేసీఆర్​అవినీతి పాలనకు తెరలేపారని రాహుల్​విమర్శించారు. కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని, కేసీఆర్​ధరణి పోర్టల్ పేరిట పేదల భూములు లాక్కుందని ఆరోపించారు. మిషన్​కాకతీయలో భారీ అవినీతికి పాల్పడ్డారని, రైతులు, దళితులు, ఆదివాసీలు, యువకులు, సమాజంలో అన్నివర్గాలను కేసీఆర్​దోచుకున్నారని రాహుల్​ధ్వజమెత్తారు. అవినీతి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అన్నివర్గాలను కోరారు. 


తెలంగాణకు రాజుగా.. సంపదను జాగీరుగా భావిస్తున్నారు

సీఎం కేసీఆర్​తనకు తాను తెలంగాణకు రాజుగా.. రాష్ట్ర సంపదను తన జాగీరుగా భావిస్తున్నారని రాహుల్​గాంధీ విమర్శించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన అన్నివర్గాల ప్రజల కలలను ధ్వంసం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు ఒకటి ఊహిస్తే.. బీఆర్ఎస్​మరొకటి చేసిందని, ఈ తొమ్మిదేళ్లలో టీఆర్ఎస్​పేరు బీఆర్ఎస్​గా మారడం తప్ప తెలంగాణలో కేసీఆర్​చేసిన మంచి పనులేవీ లేవన్నారు. పేదలు, దళితులకు నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను కేసీఆర్​తిరిగి లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే ఆ భూములు మళ్లీ వారికే పంచుతామని రాహుల్​గాంధీ అన్నారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే అన్ని హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ తెలిపారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీ టీం అయిన బీఆర్​ఎస్​కు.. కాంగ్రెస్ కు మధ్యే పోటీ నెలకొందన్నారు. రైతు బిల్లు విషయంలో పార్లమెంట్​లో బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​నిలబడితే.. బీజేపీకి బీ టీంగా వ్యవహరించిన బీఆర్ఎస్​ఆ బిల్లుకు మద్దతు తెలిపిందన్నారు. తెలంగాణలో కేసీఆర్​అవినీతి, లిక్కర్​స్కాం గురించి సెంట్రల్​ఏజెన్సీలకు తెలుసని చెప్పిన రాహుల్.. బీఆర్ఎస్ బీజేపీకి బీం కావడంతో నే ఎలాంటి చర్యలు లేవన్నారు. పాట్నా జరిగిన విపక్షాల సమావేశానికి బీఆర్ ఎస్​ను ఆహ్వానించాలని చెబితే తాము ఒప్పుకోలేదన్న రాహుల్​గాంధీ.. ఒకవేళ బీఆర్ఎస్​వస్తే కాంగ్రెస్​హాజరు కాదని తేల్చిచెప్పామన్నారు. 

బీఆర్ఎస్​తో పొత్తు ఉండబోదు..

బీఆర్ఎస్​తో కాంగ్రెస్​కు ఎలాంటి పొత్తు ఉండబోదన్న రాహుల్​గాంధీ.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని సునాయాసంగా ఓడిస్తామన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్​మార్చ్ పాదయాత్ర​ముగింపు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అయన అనుచరులు పార్టీలో చేరిక సందర్భంగా ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్​జనగర్జన సభలో రాహుల్​గాంధీ పాల్గొన్నారు. పోడు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామని అన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన రాహుల్.. ​హెలిక్యాప్టర్​లో ఖమ్మంకు చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్​శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సుమారు 22 నిమిషాల పాటు రాహుల్​గాంధీ ప్రసంగించారు. ఆయన వెంట కాంగ్రెస్​వ్యవహారాల ఇన్​చార్జి  మానిక్​రావ్​ఠాక్రే, టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

కర్ణాటక ఫలితాలు పునరావృతమవుతాయి..

కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృత్తమవుతాయని రాహుల్​గాంధీ అన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ఓడించింది. ఈ గెలుపులో అక్కడి అన్నివర్గాలు కాంగ్రెస్​కు అండగా నిలిచాయి. అక్కడి అవినీతి ప్రభుత్వం, పెట్టుబడిదారులు ఓవైపు బడుగు బలహీనవర్గాలు, రైతులు, దళితులు మరోవైపు మధ్య జరిగిన పోరులో బడుగు బలహీనవర్గాలు, రైతులే గెలుపుబావుటా ఎగురవేశారన్నారు తెలంగాణలోనూ ఇదే జరగబోతుందని పేర్కొన్నారు. 

ఘర్​వాపసీ..

2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా మంది నేతలు కాంగ్రెస్ ను వీడారు. ఇప్పడు వారందరూ తిరిగి పార్టీలో చేరాలని కోరుతున్నా. కాంగ్రెస్ లో చేరేవారి కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. బీజేపీ, బీఆర్ఎస్​ఆలోచనా విధానాలు ఉన్నవాళ్లకు కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు. కార్యకర్తలే నా వెన్నెముక. వారు కష్టకాలంలో కాంగ్రెస్​ను వదల్లేదని, బీఆర్ఎస్​నేతలు ఎన్నిదాడులు చేసిన ఓర్చుకున్నారని అన్నారు.

నా యాత్రకు స్పూర్తినిచ్చారు..!

భారత్​జోడో యాత్రను దేశవ్యాప్తంగా అందరూ సమర్థించారు. తెలంగాణలోనూ నా యాత్ర కొనసాగింది. మీరందరూ మద్దతు తెలిపి నా యాత్రకు స్ఫూర్తినిచ్చారు. ఇక్కడి సమస్యలు నాకు వివరించి.. నన్ను మీ వాడిలా భావించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్​కు కంచుకోట. మీ మనసులో కాంగ్రెస్​పదిలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్​అధికారంలోకి రాబోతుంది. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో రాష్ర్టంలో అన్నివర్గాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని కచ్చితంగా పరిష్కరిస్తామని రాహుల్​గాంధీ స్పష్టం చేశారు.